Wildfire | అమెరికాలోని సంపన్నుల నగరం లాస్ ఏంజెల్స్ (Los Angeles)లో ఇటీవలే చెలరేగిన కార్చిచ్చు (Wildfire) ఇంకా చల్లారడం లేదు. ఇంతలోనే మరోచోట కొత్తగా మంటలు చెలరేగాయి. కాస్టాయిక్ లేక్ (Lake Castaic) సమీపంలోని కొండల ప్రాంతం నుంచి అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటలు గంటల వ్యవధిలోనే 9 వేల ఎకరాలకు వ్యాపించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
కాస్టాయిన్ లేక్ సమీపంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తాజాగా కార్చిచ్చు మొదలైన ప్రాంతం ఇటీవలే దావానలంలో కాలి బూడిదైన ఈటన్ (Eaton), పాలిసేడ్స్ (Palisades)కు 64 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అక్కడ ఇంకా మంటలు చల్లారలేదు. దీనికి తోడు దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు ఈ కార్చిచ్చుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఫలితంగా మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. విమానాల సాయంతో వాటర్ బాంబులను జారవిడుస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో దాదాపు 50 వేల మందికి పైగా ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, ఇటీవలే లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో వేలాది నిర్మాణాలను బూడిద చేసింది. 28 మందిని ఈ కార్చిచ్చు బలితీసుకుంది. ఈ వైల్డ్‌ఫైర్ కారణంగా లాస్ ఏంజెల్స్ (Los Angeles) మరభూమిని తలపిస్తోంది. ఖరీదైన ఇళ్లు, కార్లు, విలువైన సామగ్రి మంటల్లో కాలిబూడిదయ్యాయి. చాలా మంది ధనవంతులు, సెలబ్రిటీలు తమ సామాన్లు, కార్లను ఇళ్లలోనే వదిలేసి బతుకుజీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఈ అగ్ని ప్రమాదాల్లో సుమారుగా 16 మంది తప్పిపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. మంటల ధాటికి ఇప్పటి వరకూ 12,000 పైగా నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అంతేకాదు, పాలిసేడ్స్‌లో 23,707, ఈటన్లో 14,117ఎకరాలు, కెన్నెత్‌లో 1,052, ముర్సెట్లో 779 ఎకరాలు దగ్ధమైనట్లు అమెరికా మీడియా పేర్కొంది. అమెరికా చరిత్రలో అత్యంత ఘోర విపత్తుగా అక్కడి అధికారులు పేర్కొన్నారు.
Also Read..
“అమెరికా చరిత్రలోనే ఘోర విపత్తు”
“Wildfires | కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు.. 29 మంది అరెస్ట్”
“Wildfire | అమెరికాలో ఆగని దావాగ్ని.. కమలా హారిస్ ఇంటికీ ముప్పు”
“Wildfires | లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు.. కాలి బూడిదైపోయిన బైడెన్ కుమారుడి ఇల్లు”
“Wildfire | కార్చిచ్చుకు కారణమేంటి.. లాస్ ఏంజెల్స్ వైల్డ్ఫైర్పై ఫెడరల్ విచారణ షురూ”