లాస్ ఏంజెల్స్: అమెరికా చరిత్రలో అత్యంత ఘోర విపత్తుగా భావిస్తున్న లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు ఇంకా కొనసాగుతున్నది. వేలాది ఇండ్లను ధ్వంసం చేసి, 24 మంది మృతికి కారణమైన ఈ దావానలాన్ని నియంత్రించడానికి అగ్నిమాపక సిబ్బంది ఆదివారం ఎంతో శ్రమించారు. ఇప్పటికీ 16 మంది జాడ తెలియడం లేదని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కాల్చిన బాణసంచా వల్ల కార్చిచ్చు సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఉపగ్రహ ఛాయా చిత్రాలు, రేడియో కమ్యూనికేషన్లు, స్థానికుల కథనాలు ఈ అనుమానాలకు ఊతమిస్తున్నాయి. దీనిపై వాషింగ్టన్ పోస్ట్ ఓ వార్త కథనాన్ని ప్రచురించింది.
పాలిసేడ్స్లో సంపన్నులు నివసిస్తుంటారు. కార్చిచ్చు వల్ల వారు ఇండ్లను వదిలి వెళ్లిపోయారు. దీంతో దొంగలు ఆ ఇండ్లను దోచుకుంటున్నారు. ఓ దొంగ ఏకంగా అగ్నిమాపక సిబ్బంది ధరించే యూనిఫాంతో సంచరించడాన్ని అధికారులు గుర్తించారు.