లాస్ ఏంజెల్స్: అమెరికా చరిత్రలో అత్యంత ఘోర విపత్తుగా భావిస్తున్న లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు (Wildfire) ఇంకా కొనసాగుతూనే ఉన్నది. జనవరి 7న మొదలైన ఈ వైల్డ్ ఫైర్ వారం రోజులు గడుస్తున్నప్పటికీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అగ్నిమాపక సిబ్బంది చిన్నచిన్న మంటలను అదుపులోకి తెస్తున్నా.. పెద్ద అగ్ని కీలలు అదుపులోకి రావడం లేదు. బలమైన గాలుల కారణంగా మంటలు మరింత తీవ్రతరం అవుతాయని అంచనావేస్తున్నారు.
కాగా, కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు వేలాది ఇండ్లను ధ్వంసమవగా, 25 మంది మృతిచెందారు. దాదాపు 30 మంది తప్పిపోగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. సుమారు 30 వేల ఎకరాలకుపైగా ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తున్నారు. అసలు ఈ కార్చిచ్చుకు కారణం ఏంటి? మంటలు ఎలా అంటుకున్నాయి? దీనివెనుక ఏదైనా కుట్ర దాగి ఉన్నదా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణాలను హరిస్తున్న దావాగ్నిపై ఫెడరల్ విచారణ ప్రారంభమైంది. జోస్ మెడినా ఆధ్వర్యంలో 75 మందితో కూడిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఆల్కహాల్ టొబాకో అండ్ ఫైర్ఆర్మ్స్ (ATF) బృందం దర్యాప్తు చేపట్టింది. మంటలు ఎలా అంటుకున్నాయనే ప్రశ్నకు సమాధానం కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ప్రతిఒక్కరికి సందేహాన్ని తాము తీర్చుతాం. కానీ లోతుగా విచారించిన తర్వాతే జవాబు లభించే అవకాశం ఉంటుందని విచారణ బృందానికి నేతృత్వం వహిస్తున్న జోస్ అన్నారు.
ఈనెల 7న లాస్ ఏంజెల్స్‌కు పశ్చిమాన 32 కిలోమీటర్ల దూరంలోని పాలిసేస్లో మంటలు అంటుకున్నాయి. లాస్ ఏంజెల్స్ మాత్రమే కాదు, కాలిఫోర్నియాలోని చుట్టుపక్కల నగరాల నుంచి తెప్పించిన ఫైర్ ఇంజిన్లు, హెలికాప్టర్లతో నీటిని గుమ్మరిస్తున్నా మంటలు అదుపులోకి రావడం లేదు. ఇక్కడ 23 వేలకుపైగా ఎకరాల్లో మంటలు అంటుకున్నాయి.బలమైన గాలులు వీస్తుండటంతో లాస్ ఏంజెల్స్‌కు ఉత్తరం వైపున ఈటన్ ప్రాంతానికి మంటలు వ్యాపించాయి. ఇక్కడ కూడా 14 వేల ఎకరాలకు మంటలు అంటుకున్నాయి. శాన్ ఫెర్నాండోకు ఉత్తరాన హస్ట్ అనే చోట కూడా కార్చిచ్చు అంటుకున్నది. ఇక్కడ 800 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆస్తులు కాలిబూడిదయ్యాయి.
న్యూ ఇయర్ వేడుకల ప్రభావమేనా?
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కాల్చిన బాణసంచా వల్ల కార్చిచ్చు సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఉపగ్రహ ఛాయా చిత్రాలు, రేడియో కమ్యూనికేషన్లు, స్థానికుల కథనాలు ఈ అనుమానాలకు ఊతమిస్తున్నాయి. దీనిపై వాషింగ్టన్ పోస్ట్ ఓ వార్త కథనాన్ని ప్రచురించింది.
దొంగల చేతివాటం
పాలిసేడ్స్‌లో సంపన్నులు నివసిస్తుంటారు. కార్చిచ్చు వల్ల వారు ఇండ్లను వదిలి వెళ్లిపోయారు. దీంతో దొంగలు ఆ ఇండ్లను దోచుకుంటున్నారు. ఓ దొంగ ఏకంగా అగ్నిమాపక సిబ్బంది ధరించే యూనిఫాంతో సంచరించడాన్ని అధికారులు గుర్తించారు.