వాషింగ్టన్, నవంబర్ 5: అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ మంగళవారం 36వ రోజుకు చేరుకుంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్డౌన్గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ షట్‌డౌన్‌తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఆహార సహాయంతోపాటు సామాన్య ప్రజల నిత్య జీవితంలోని కీలక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు కోతపడగా విమాన ప్రయాణాలలో ఆలస్యాలు, జీతం లేకుండా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తుండడంతో ప్రజల జీవితాలపై ఈ షట్‌డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.
ఇప్పటికీ ఇది ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. సెప్టెంబర్ 30 తర్వాత ప్రభుత్వ బడ్జెట్‌కు అమెరికన్ పార్లమెంట్ ఆమోదం తెలియచేయకపోవడంతో ప్రభుత్వ వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. సంక్షేమ కార్యక్రమాలకు తీవ్ర నిధుల కొరత ఏర్పడింది.