వాషింగ్టన్ : అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా లాస్ ఏంజిలిస్‌లో ప్రారంభమైన నిరసనలు అయిదో రోజైన మంగళవారం మరిన్ని నగరాలకు విస్తరించి తీవ్ర రూపం దాల్చాయి. షికాగోలో వెయ్యి మందికి పైగా నిరసనకారులు కవాతు నిర్వహించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. దేశ బహిష్కరణ చర్యలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. ఇదే తరహా ఆందోళనలు న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, డాలస్, బోస్టన్, పోర్ట్‌ల్యాండ్, ఫిలడెల్ఫియా, సియాటెల్, అట్లాంటా, లాస్ వెగాస్ తదితర నగరాల్లో కనిపించాయి.
కొన్ని చోట్ల ఆందోళనకారులు ముసుగులు ధరించి, మెక్సికో జాతీయ పతాకాలను చేత పట్టుకొని ఆందోళనలు నిర్వహించారు. న్యూయార్క్‌లో కొందరు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 14న అమెరికా సైన్యం 250 వార్షికోత్సవం నేపథ్యంలో ఆందోళనకారులను ట్రంప్ హెచ్చరించారు. నిరసనలు చేయాలనుకొనేవారు భారీ బలగాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు కాలిఫోర్నియాలో బలగాల మోహరింపును వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ గవిన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే బలగాల మోహరింపును అడ్డుకోవడానికి జడ్జి నిరాకరించారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
మరోవైపు లాస్ ఏంజిలిస్‌లో సోమవారం రాత్రి కొందరు నిరసనకారులు మాస్కులు ధరించి హఠాత్తుగా అద్దాలు పగులగొట్టి యాపిల్ సహా పలు కంపెనీల షాపుల్లోకి చొరబడి లూటీలకు ప్రయత్నించారు. ఆయా షాపుల భవనాలపై నిరసన రాతలు రాశారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడం, దుకాణాలకు నష్టం జరగడంతో లాస్ ఏంజిలిస్ మేయర్ కరెన్ బాస్ నగరంలో పాక్షిక కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
నిరసనల్లో మెక్సికో జాతీయ పతాకం ప్రముఖంగా కనిపిస్తున్నది. దాంతో పాటు ఇతర లాటిన్ అమెరికా దేశాల పతాకాలను, అమెరికా జాతీయ జెండాను చేతబూని నిరసనకారులు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. లాస్ ఏంజిలిస్తో మెక్సికోకు సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి.