కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఇవాళ పేలుళ్లతో దద్ధరిల్లిపోయింది. కమికేజ్ డ్రోన్ల(Kamikaze Drones)తో రష్యా దాడి చేసినట్లు అధ్యక్ష సలహాదారు ఆరోపించారు. కీవ్‌ను నాశనం చేసేందుకు రష్యా ఆసక్తిగా ఉన్నట్లు అధ్యక్ష ఆఫీసు అధిపతి ఆండ్రీ యెర్మాక్ తెలిపారు. సెంట్రల్ షెవ్చెవిన్స్కీ ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ధ్వంసమైనట్లు మేయర్ విటాలీ క్లిచ్కో చెప్పారు. వారం క్రితం కూడా రష్యా మిస్సైళ్లు కీవ్ నగరాన్ని బీభత్సం చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 19 మంది మరణించారు.
ఇవాళ ఉదయం 6.30 నిమిషాల నుంచే పేలుళ్లు వినిపించాయి. మొత్తం అయిదు సార్లు ఆ శబ్ధాలు వినిపించినట్లు అధికారులు చెబుతున్నారు. సిటీ సెంటర్‌కు సమీపంలో రెండు పేలుళ్ల శబ్ధాలు వచ్చాయి. రష్యాను ఎదుర్కొనేందుకు మరిన్ని డిఫెన్స్ సిస్టమ్స్ కావాలని, గగనతలానికి రక్షణ కవచంగా నిలిచే ఆయుధాలు కావాలని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం పేర్కొన్నది.
కమికేజ్ డ్రోన్ ఒకటి కీవ్‌లో కుప్పకూలింది. డ్రోన్‌కు చెందిన ఫోటోను ఒకటి నగర మేయర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇరాన్‌కు చెందిన డ్రోన్లను రష్యా వాడుతున్నట్లు ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల క్రిమియా బ్రిడ్జ్ పేల్చివేతకు ప్రతీకారంగా కీవ్‌పై రష్యా మిస్సైళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
కమికేజ్ అంటే..
కమికేజ్ డ్రోన్లు చిన్నపాటి ఏరియల్ వెపన్స్. టార్గెట్‌ను ఢీకొన్న తర్వాత ఈ డ్రోన్లు పేలుతాయి. నిజానికి చాలా వరకు డ్రోన్లు.. టార్గెట్ల వద్ద బాంబును వదిలి వెనక్కి వస్తాయి. కానీ కమికేజ్ డ్రోన్లు మాత్రం అక్కడే డిస్పోజ్ అవుతాయి. జపాన్ పైలెట్ల ఆధారంగా ఆ డ్రోన్లకు ఆ పేరు పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ పైలెట్లు కావాలనే తమ విమానాలతో సూసైడ్‌కు పాల్పడేవారు. ఆ ఘటనల ఆధారంగా కమికేజ్ పేరును ఫిక్స్ చేశారు.