Kim Jong Un: ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతున్నది. మరోవైపు హమాస్ మిలిటెంట్లు-ఇజ్రాయెల్ సేనల మధ్య కూడా భీకర యుద్ధం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
దక్షిణ కొరియా దేశంతో పునరేకీకరణకు తాను ఒప్పుకోబోనని, అవసరమైతే యుద్ధానికి సిద్ధం కావాలని కిమ్ తన సైన్యాన్ని ఆదేశించినట్టు తెలుస్తున్నది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో డిసెంబర్ 26 నుంచి 30 వరకు జరిగిన పాలక వర్కర్స్ పార్టీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన కిమ్.. ఈ విధంగా ఆదేశాలు జారీ చేసినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) పేర్కొన్నది.
అవసరమైతే దక్షిణకొరియాపై అణు బాంబు వేయడానికి సిద్ధంగా ఉండాలని కిమ్ తన సేనలకు చెప్పినట్టు KCNA వెల్లడించింది. అలాగే నూతన సంవత్సరంలో కిమ్ తన లక్ష్యాలను వెల్లడించినట్టు తెలిపింది. ఆ లక్ష్యాల్లో ఈ ఏడాది మూడు గూఢచార ఉపగ్రహాలను ప్రయోగించడం, మానవరహిత డ్రోన్ల నిర్మాణం, అణు క్షిపణి ప్రయోగాలను బలోపేతం చేయడం లాంటివి ఉన్నాయి. శత్రువులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే దీటుగా బదులివ్వాలని ఆదేశించినట్లు సమాచారం. గతేడాది ఉత్తరకొరియా అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.