సియోల్: పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రష్యా, ఉత్తర కొరియా చేతులు కలిపాయి. ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ రష్యాలోని ఫార్ ఈస్ట్ అనే ప్రాంతంలో ఆ దేశంలోని అత్యంత ప్రధాన అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో బుధవారం సమావేశమయ్యారు. నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశం అనంతరం పుతిన్‌కు కిమ్ బేషరతు మద్దతు ప్రకటించారు. అయితే వీరి కలయిక వల్ల ఉక్రెయిన్‌లో యుద్ధం కోసం రష్యాకు ఆయుధాల సరఫరా కోసం ఒప్పందం కుదరబోతోందని అమెరికా హెచ్చరించింది.
ప్రస్తుతం ఉత్తర కొరియా వద్ద ఆయుధాలు గుట్టలుగా పోగుపడినట్లు తెలుస్తున్నది. ఈ ఆయుధాలు, రాకెట్లను పుతిన్ కోరుతున్నట్లు సమాచారం. 1950-53 మధ్య కాలంలో కొరియన్ యుద్ధం జరిగింది. అప్పట్లో దక్షిణ కొరియాపై యుద్ధం కోసం ఉత్తర కొరియాకు రష్యా ఆయుధాలను సరఫరా చేసింది. ఉత్తర కొరియాకు దశాబ్దాల నుంచి రష్యా మద్దతిస్తున్నది. ఇప్పుడు ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యాకు అవసరమైన ఆయుధాలను ఉత్తర కొరియా సరఫరా చేయబోతోందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు మిలిటరీ నిఘా ఉపగ్రహాలను అభివృద్ధి చేయడంలో రష్యా సహకారాన్ని కిమ్ కోరుతున్నారు.