Khwaja Asif : పాకిస్థాన్ (Pakistan) ప్రధాని (Prime Minister) షెహబాజ్ షరీఫ్ (Shahabaz Sharif) ఒకవైపు అమెరికా పర్యటన (US tour) కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి (Deffence minister) ఖవాజా ఆసిఫ్ (Khawaza Asif) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతలు అవినీతిపరులని, వారు ఇజ్రాయెల్ నుంచి లంచాలు స్వీకరిస్తున్నారని ఆరోపించారు.
పాకిస్థాన్‌కు చెందిన జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ.. తాము లంచాలు స్వీకరించినట్లు తీవ్ర అపవాదులు ఎదుర్కొన్నామని, కానీ అమెరికా రాజకీయ నాయకులు ఇజ్రాయెల్ నుంచి బహిరంగంగానే లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. అదే నేను లంచం స్వీకరించాల్సి వస్తే ఎక్కడో చాటుగా తీసుకుంటానని, అయినా తాము నిందలు మోశామని అన్నారు. కానీ అమెరికా నేతలు బహిరంగంగానే అవినీతి చేస్తున్నారని విమర్శించారు. అమెరికా మిలిటరీ అధికారులు, ప్రతినిధులసభ సభ్యులు, ఉన్నతస్థాయి పాలకులు తాము ఇజ్రాయెల్ నుంచి నిధులు అందుకున్నట్లు అంగీకరించారని తెలిపారు.
మరోవైపు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కే షాకిచ్చారు. భారత్ ఎప్పుడూ మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని న్నారు. ఆయన అల్-జజీరాతో మాట్లాడుతూ.. ‘మూడో పక్షం పాత్ర ఉన్నా మేం ఏమీ అనుకోం. కానీ ఇది ద్వైపాక్షిక అంశమే అని భారత్ పేర్కొంది. సరే ఏ చర్చలు జరిగినా ఉగ్రవాదం, వాణిజ్యం, జమ్ముకశ్మీర్‌పై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిం మునీర్ త్వరలోనే అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పాక్ మంత్రుల ప్రకటనలు వారిని ఇబ్బందుల్లో పడేసేలా ఉన్నాయి.