Khaled Mashal | హమాస్ రాజకీయ విభాగం చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యారు. ఇరాన్ టెహ్రాన్‌లోని ఇంటి వద్ద ఉండగా దాడి జరిగింది. ఘటనలో ఆయనతో పాటు సెక్యూరిటీ గార్డ్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. అయితే, హత్య ఉదంతంలో ఇజ్రాయెల్ ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. గత కొంతకాలంగా ఇజ్రాయెల్‌పై హమాస్ పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇస్మాయిల్ హనియా హత్య అనంతరం మళ్లీ హమాస్ రాజకీయ విభాగం చీఫ్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే చర్చ జరుగుతున్నది. అయితే, హనియా స్థానంలో ఖలీద్ మషాల్‌ను కొత్త చీఫ్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రమల్లాలోని సిల్వాడ్‌లో ఖలీద్ మషాల్ సన్మానించారు.
ఖలీద్ మషాల్ 15 సంవత్సరాల వయస్సులో ముస్లిం బ్రదర్ హుడ్‌లో చేరాడు. 1980 చివరలో హమాస్ ఏర్పాటులో ముస్లిం బ్రదర్ హుడ్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఖలీద్ మషాల్ హమాస్ ఉగ్రవాద సంస్థకు చాలా సంవత్సరాలు విదేశాల నుంచి నిధులు సేకరిస్తూ వస్తున్నారు. జోర్డాన్‌లో అంతర్జాతీయ నిధుల సేకరణ విభాగానికి చీఫ్‌గా ఉన్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. 1997లో జోర్డాన్ రాజధాని అమ్మాన్ లో మషాల్ కు విషమిచ్చి చంపేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించిన సహయంలో ఖలీద్ మషాల్ తొలిసారి వార్తలకెక్కారు. అయితే, ఆ దాడి నుంచి మషాల్ ప్రాణాలతో బయటపడ్డారు. 68 ఏళ్ల మషాల్ ప్రవాసంలో ఉన్న హమాస్ రాజకీయ విభాగానికి నాయకత్వం వహించారు. తాజాగా హనియా హత్య నేపథ్యంలో ఆయనను రాజకీయ విభాగం చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవమెంతో వేచి చూడాల్సిందే.