Karoline Leavitt | చైనాపై బుధవారం నుంచి 104శాతం సుంకాలను విధిస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. అయితే, అమెరికాపై ఎదురుదాడి చేయడంపై చైనా చేసిన తప్పని వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అమెరికాను సవాల్ చేస్తే.. ప్రతిస్పదన బలంగా ఉంటుందని హెచ్చరించారు. అమెరికాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే.. మరింత బలంగా ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. అందుకే చైనాపై 104శాతం సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. చైనా రాజీ కోసం ప్రయత్నిస్తే.. అమెరికా ఉదారంగా వ్యవహరిస్తుందన్నారు. ట్రంప్ పరిపాలన అన్యాయంగా భావించే వాణిజ్య పద్ధతులను సరిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో కొత్త సుంకాలు భాగమేనని.. దీని కారణంగా అమెరికా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. చైనా వాణిజ్య విధానాలను విమర్శిస్తూ.. తమ కార్మిక వర్గానికి చైనా ఆర్థిక సమస్యలను పెంచుతోందని ఆరోపించారు.
అమెరికా ఆర్థిక లొంగుబాటు యుగం ముగిసిందని అధ్యక్షుడు ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారని కరోలిన్ లీవిట్ స్పటం చేశారు. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న చైనాతో సహా పలు దేశాలు తప్పు చేస్తున్నాయని ఆయన అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ వెన్నెముక ఇనుములా బలంగా ఉందని.. ఆయన నాయకత్వంలో అమెరికా విచ్ఛిన్నం కాదన్నారు. ట్రంప్ సుంకాల వ్యవధిని పొడిగించడం, వాయిదా వేయడం గురించి ఆలోచించలేదని, కానీ ఫోన్ తీసుకొని ఎవరితోనైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని లీవిట్ పేర్కొన్నారు. మరో వైపు పనామా కాలువకు చైనా నుంచి నిరంతరం ముప్పు ఉందని, అయితే అమెరికా, పనామా కలిసి దాన్ని సురక్షితంగా ఉంచుతాయని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తెలిపారు. పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినోతో సమావేశం తర్వాత.. నేవీ నునెజ్ డీ బాల్బోవా స్థావరంలో అమెరికన్ నిధులతో కూడిన డాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హెగ్సేత్ మాట్లాడుతూ కాలువ కార్యకలాపాలను బెదిరించే ఏ దేశమూ దాని భద్రత విషయంలో రాజీ పడేందుకు అమెరికా, పనామా అనుమతించవన్నారు.