Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్స్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు భారీ స్థాయిలో మద్దతు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో ట్రంప్‌కు వచ్చిన విరాళాల కంటే హారిస్‌కు రెట్టింపు రావడం గమనార్హం.
డెమోక్రాట్ తరఫున అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కమలా హారిస్ పూర్తిస్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆగస్టులో 30 లక్షల మంది దాతల నుంచి 36.1 కోట్ల డాలర్ల విరాళాలను సేకరించారు. సెప్టెంబర్‌లో న్యూయార్క్, అట్లాంటా, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు హారిస్ బృందం ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ మాత్రం ఆగస్టులో 13 కోట్ల డాలర్లను మాత్రమే సేకరించినట్లు ఆయన బృందం వెల్లడించింది.
నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఇందుకోసం మొత్తంగా 1 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ప్రకటనలు, ఆయా రాష్ట్రాల్లో ప్రచారానికయ్యే ఖర్చుల కోసం నిధులను సేకరిస్తున్నాయి.