Commander | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పెంపుడు శునకం ‘కమాండర్’ (Commander) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తోంది. అందుకు కారణం అధ్యక్షుడి రక్షణ సిబ్బందిపై అది విరుచుకుపడటమే. కమాండర్ ఇటీవలే వైట్‌హైస్ (White House) సిబ్బందిపై వరుస దాడులతో బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. రక్షణ సిబ్బందిని కమాండర్ ఈ ఏడాది ఇప్పటి వరకూ 11 సార్లు కరిచింది. ఇది అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే. అనధికారికంగా ఇలాంటి ఘటనలు ఎక్కువే చోటు చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా కమాండర్ వైట్‌హౌస్‌ను వీడినట్లు తెలుస్తోంది.
వరుస దాడుల నేపథ్యంలో కమాండర్‌ను శ్వేతసౌధం నుంచి వేరే చోటుకి తరలించినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. వైట్‌హౌస్‌లో విధులు నిర్వహించే సిబ్బంది భద్రత విషయంలో అధ్యక్షుడు, ప్రథమ మహిళ చాలా శ్రద్ధ వహిస్తారని తెలిపారు. ఇందులో భాగంగానే కమాండర్‌ను కూడా వేరే ప్రదేశానికి తరలించినట్లు వెల్లడించారు. కమాండర్ ప్రస్తుతం వైట్‌హౌస్ క్యాంపస్‌లో లేదని.. దాన్ని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు.
కాగా, జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ శునకాన్ని బైడెన్ కు ఆయన సోదరుడు జేమ్స్ కానుగా ఇచ్చారు. 2021లో బైడెన్ ఈ శునకాన్ని వైట్‌హౌస్‌కు తీసుకొచ్చారు. ఇక 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకూ ఈ శునకం కనీసం 11 సార్లు సీక్రెట్ సర్వీస్ అధికారులను కరిచినట్లు యూఎస్ మీడియా నివేదించింది. ఈ విషయాన్ని శ్వేత సౌధం (White House)కూడా అంగీకరించింది. కమాండర్ దాడిలో గాయపడిన ఒకరిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స కూడా అందించినట్లు సదరు నివేదికలు వెల్లడించాయి. కాగా, అధ్యక్షుడి వద్ద అంతకుముందు మేజర్ అనే శునకం కూడా ఉండేది. అది కూడా కమాండర్ లానే కొంత మంది సీక్రెట్ సర్వీస్ అధికారుల్ని కరుస్తుండటంతో దాన్ని అధ్యక్షుడు తన మిత్రుల వద్దకు పంపించేశారు. అయితే ఇప్పుడు కమాండర్‌ను ఎక్కడికి తరలించారన్నది మాత్రం తెలియలేదు.
Also Read..
MS Dhoni | ధోనీ బుగ్గపై ముద్దుపెట్టిన స్టార్ హీరో.. పిక్స్ వైరల్
Babar Azam | హైదరాబాద్ బిర్యానీకి బాబర్ రేటింగ్.. ఎన్ని మార్కులు ఇచ్చారంటే..
Amitabh Bachchan | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. అమితాబ్ బచ్చన్‌కు భారీ జరిమానా..!