Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది..! ప్రెసిడెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడి ప్రవర్తనతో డెమోక్రాటిక్ పార్టీలో తీవ్ర ఆందోళ వ్యక్తమవుతోంది. ఎన్నికల వేళ బైడెన్ తడబడుతుండటం డెమోక్రాట్లకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే మతిమరుపు, తడబాట్లతో తీవ్ర విమర్శలపాలైన బైడెన్.. తాజాగా మరోసారి అదేపొరపాటు చేసి మీడియాకు చిక్కారు.
శనివారం పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి (Trump attack) నేపథ్యంలో బైడెన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తప్పులు మాట్లాడారు. బ్యాలెట్ బాక్సులకు బదులు బ్యాటిల్ బాక్సులు (యుద్ధపు పెట్టెలు) అని సంభోదించారు. దీంతో అక్కడే ఉన్న డెమోక్రాటిక్ పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు.
‘నేను మన ప్రజాస్వామ్యం కోసం గట్టిగా మాట్లాడటం కొనసాగిస్తాను. మన రాజ్యాంగం, చట్ట నియమాల కోసం నిలబడతా. అమెరికాలో మా విభేదాల పరిష్కారానికి బ్యాటిల్ బాక్సు (battle box)ను నమ్ముతాం. ఇప్పుడు కూడా మేం వాటిని బ్యాటిల్ బాక్సుల్లోనే పర్కిష్కరించుకుంటాం. బుల్లెట్లతో కాదు’ అని వ్యాఖ్యానించారు. అయితే, బ్యాలెట్ బాక్సులు (ballot box) అనడానికి బదులు బ్యాటిల్ బాక్సులు అని తప్పుగా మాట్లాడి మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. దీంతో అధ్యక్షుడి మాటలతో డెమోక్రాటిక్ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్.. యూఎస్ ఉపాధ్యక్షుడు ట్రంప్.. మళ్లీ తడబడిన బైడెన్
బైడెన్ ఇలా తడబాటుకు గురికావడం ఇదేమీ మొదటి సారి కాదు. మీడియా సాక్షిగా వందల సార్లు ఇలానే మాట్లాడారు. తన మతిమరుపు, పొరపాట్లతో అనేకసార్లు హెడ్‌లైన్స్‌లో నిలిచారు. గత వారం నాటో శిఖరాగ్ర సమావేశ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పరిచయం చేస్తున్న సమయంలో ‘ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పుతిన్..’ అని అనేశారు. ఇప్పుడు మైక్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడికి అప్పగిస్తానని, చాలా ధైర్యవంతుడని, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని పలుకుతూ ప్రెసిడెంట్ పుతిన్ అని బైడెన్ పేర్కొన్నారు. ఆ తర్వాత బైడెన్ తన వ్యాఖ్యలను వెంటనే సవరించుకున్నారు. ప్రెసిడెంట్ పుతిన్‌ను ఆయన ఓడిస్తారని, ఆయనే ప్రెసిడెంట్ జెలెన్స్కీ అని బైడెన్ తెలిపారు. పుతిన్‌ను ఓడించే అంశంలో తాను కూడా ఫోకస్ పెట్టినట్లు బైడెన్ చెప్పారు.
అదేవిధంగా.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ (Kamala Harris) అనబోయి.. ఉపాధ్యక్షుడు ట్రంప్ (Vice President Trump) అని సంభోదించారు. నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు ముగిసిన అనంతరం బైడెన్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘మీరు అధ్యక్ష రేసు నుంచి వైదొలిగితే ట్రంప్‌ను కమలా హ్యారిస్ ఓడించగలరని భావిస్తున్నారా..?’ అని విలేకరులు బైడెన్‌ను ప్రశ్నించారు. దీనికి అధ్యక్షుడు సమాధానమిస్తూ.. ‘అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు ఉపాధ్యక్షుడు ట్రంప్‌కు లేకుంటే నేను అసలు ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాణ్నే కాదు’ అంటూ బదులిచ్చారు. అక్కడ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అనకుండా ట్రంప్ అనడంతో ఇప్పుడు బైడెన్ మానసిక పరిస్థితి మరోసారి చర్చకు దారితీస్తోంది.
మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న ఆయనపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయన అభ్యర్థిత్వం వదులుకోవాలంటూ సొంత పార్టీలో నిరసన గళాలు అధికం అవుతున్నాయి. ఈ తరుణంలో ఆయన తడబడటం ప్రాధాన్యత సంతరించుకుంది. అధ్యక్షుడి మానసిక స్థితి సరిగా లేదంటూ సోషల్ మీడియాలో పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read..
Radhika Merchant | మంగల్ ఉత్సవ్‌లో బంగారు దుస్తుల్లో మెరిసిన రాధికా మర్చెంట్.. ఫొటోలు వైరల్
PM Modi | నేపాల్ నూతన ప్రధాని కేపీ శర్మ ఓలీకి మోదీ శుభాకాంక్షలు
Food Deliveries | కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ, జొమాటో.. ప్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం పెంపు