ఇస్లామాబాద్ : ఇరాన్, అమెరికా మధ్య పాకిస్థాన్‌లో చర్చలు జరగనున్న విషయం తెలిసిందే. ఇస్లామాబాద్‌లో జరిగే ఆ చర్చల్లో అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) నాయకత్వం వహించనున్నారు. శుక్రవారం లేదా శనివారం ఆ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాన్‌పై బాంబుల వర్షానికి అమెరికా రెండు వారాల బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికా సర్కారు తరపున జేడీ వాన్స్‌తో పాటు దౌత్యవేత్తలుగా స్టీవ్ విట్కాఫ్, జేర్డీ కుష్నర్ పాల్గోనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా జేడీ వాన్స్‌ను పాకిస్థాన్‌కు పంపడం లేదని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అమెరికా సీక్రెట్ సర్వీస్ ఇచ్చిన హామీ నేపథ్యంలో వాన్స్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులు కూడా ఇస్లామాబాద్ వెళ్లనున్నట్లు వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలినా తెలిపారు. ఉపాధ్యక్షుడితో పాటు దౌత్యవేత్తలకు పూర్తి రక్షణ కల్పించనున్నట్లు చెప్పారు. అయితే ఇరాన్, అమెరికా మధ్య చర్చల్లో మధ్యవర్తులు పాల్గొంటారా లేక నేరుగానే ఆ రెండు దేశాల ప్రతినిధులు చర్చలు నిర్వహిస్తారా అన్న విషయం ఇంకా తెలియరాలేదు.
అమెరికా తరపున జేడీ వాన్స్ బృందానికి నాయకత్వం వహించాలని ఇరాన్ ఆశిస్తున్నది. ఎందుకంటే గతంలో విట్కాఫ్, కుష్నర్లు ఇరాన్ అభిప్రాయాలను తప్పుగా ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వంలో ఇరాన్‌పై వార్‌ను వ్యతిరేకించిన వ్యక్తుల్లో జేడీ వాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇరాన్ భావిస్తున్నది. ఇరానియన్లపై నమ్మకంతో డీల్ కుదుర్చుకోవాలని హంగేరిలో జరిగిన ఓ సమావేశంలో వాన్స్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సీజ్ఫైర్ అమలులో ఉన్నా.. లెబనాన్ అంశంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో లెబనాన్‌లోని హిజ్బుల్లాను ఐడీఎఫ్ టార్గెట్ చేస్తున్నది. సీజ్ఫైర్లో లెబనాన్ కూడా ఉన్నట్లు ఇరాన్ భావించి ఉంటుందని, కానీ తాము ఆ ప్రామిస్ చేయలేదని వాన్స్ అన్నారు. ఒకవేళ లెబనాన్ అంశంలో సీజ్‌ఫైర్‌కు ఇరాన్ గుడ్‌బై చెప్పాలనుకుంటే, అప్పుడు అది వాళ్ల స్వంత విషయం అవుతుందని వాన్స్ పేర్కొన్నారు.
మరో వైపు చర్చలకు వేదిక కానున్న ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అమెరికా, ఇరాన్ చర్చల నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు. ఇస్లామాబాద్ జిల్లా యంత్రాంగం సెలవులపై ప్రకటన చేసినా.. దాంట్లో ఏ కారణం అన్న విషయాన్ని చెప్పలేదు. చర్చల్లో పాల్గొనేందుకు హై ప్రొఫైల్ నేతలు వస్తున్న నేపథ్యంలో భద్రతా ఆంక్షల వల్ల సెలవులు ప్రకటించి ఉంటారని భావిస్తున్నారు. ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీకి ఇవాళ, రేపటికి మాత్రమే సెలవులు వర్తిస్తాయని ఇస్లామాబాద్ జిల్లా కమీషనర్ వెల్లడించారు. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయన్నారు.