టోక్యో: ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా తర్వాతి స్థానం జపాన్దే. అయితే తాజాగా జపాన్ నాలుగో స్థానానికి పడిపోయింది. గత ఏడాది ఆ దేశ జీడీపీ జర్మనీ కంటే తక్కువగా నమోదైంది. గతేడాది జపాన్ నామమాత్రపు జీడీపీ 4.2 ట్రిలియన్ డాలర్లు కాగా.. అదే సమయంలో మూడో స్థానంలో ఉన్న జర్మనీ 4.4 ట్రిలియన్ డాలర్లుగా ఎదిగింది.
అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జపాన్ వాస్తవిక జీడీపీ వృద్ధిని చూస్తే సంవత్సరానికి 0.4 శాతం తగ్గుదల కనిపించింది. మూడు నెలల వారీగా చూస్తే 0.1 శాతం క్షీణించింది. తాజా ధరలతో నామమాత్రపు జీడీపీని లెక్కిస్తుండగా.. స్థిర ధరల ఆధారంగా వాస్తవిక జీడీపీని లెక్కిస్తారు. జపాన్లో ఎందుకింత క్షీణత కనిపిస్తుందన్న దాన్ని విశ్లేషిస్తే.. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవటం, పిల్లల సంఖ్య బాగా తగ్గిపోవటం వల్ల ఉత్పాదకతలో తగ్గుదల ఏర్పడింది.
పోటీతత్వాన్ని కూడా జపాన్ క్రమేపీ కోల్పోసాగిందని అర్థమవుతున్నది. తాజాగా వెలువడిన గణాంకాలు కూడా ఈ విషయాన్నే ప్రతిబింబిస్తున్నాయి. అణు దాడుల్లో సర్వనాశనమైన దశ నుంచి కసిగా ఎదిగిన జపాన్.. సుమారు రెండు దశాబ్దాల పాటు ఆర్థిక వ్యవస్థలో నంబర్ 2 స్థానాన్ని నిలబెట్టుకున్నది. 2010లో చైనా విజృంభించి జపాన్ను మూడో స్థానానికి నెట్టేసింది.