Japan Airlines | విమానాల్లో సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా జపాన్ ఎయిర్‌లైన్స్ (Japan Airlines)కు చెందిన ఓ విమానం సాంకేతిక సమస్య కారణంగా 36 వేల అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకు జారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం ఒక్కసారిగా వేల అడుగుల నుంచి కిందకు జారడంతో ప్రయాణికులు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉండటంతో సిబ్బంది వారికి ఆక్సిజన్ మాస్కులను అమర్చారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం (Boeing 737 plane) జూన్ 30న చైనాలోని షాంఘై ఎయిర్పోర్ట్ నుంచి జపాన్‌లోని టోక్యోకు (Shanghai to Tokyo) బయల్దేరింది. విమానం దాదాపు 36 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం పది నిమిషాల్లోనే 10,500 అడుగుల కంటే తక్కువ ఎత్తుకు వేగంగా జారింది. ఆ సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం ఒక్కసారిగా కిందకు జారడంతో అందులోని ప్రయాణికులు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉండటంతో.. సిబ్బంది ఆక్సిజన్ మాస్కులను అమర్చారు.
అయితే, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు పరిస్థితిని వివరించి.. విమానాన్ని ఒకాసాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Kansai Airport) మళ్లించారు. అక్కడ విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన అనంతరం ప్రయాణికులు తమకు ఎదురైన ఈ భయానక అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో వసతి కల్పించిన అధికారులు.. మరో విమానంలో వారిని గమ్య స్థానాలకు తరలించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Also Read..
GST Relief | మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ రిలీఫ్.. ఆ వస్తువులపై పన్ను తగ్గించే యోచనలో కేంద్రం..?
Himachal Pradesh | భారీ వర్షాలకు హిమాచల్ అతలాకుతలం.. 51 మంది మృతి
Delhi CM | 5 టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం నివాసానికి రూ.60 లక్షలతో పునరుద్ధరణ పనులు