గాజా స్ట్రిప్, మే 25 : గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. 24 గంటల వ్యవధిలో ఆ దేశం జరిపిన వైమానిక దాడుల్లో 38 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. ఒక టెంట్లో ఆశ్రయం పొందుతున్న తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు కూడా మృతుల్లో ఉన్నారని వివరించింది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన తర్వాత మార్చి నుంచి ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో 3,785 మంది పౌరులు మరణించారని వెల్లడించింది.
కాగా, హమాస్‌ను పూర్తిగా నిరాయుధీకరణ చేయడమే కాక, వారి వద్ద బందీలుగా ఉన్న 53 మంది తమ దేశ పౌరులను విడిపించేంత వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రతిజ్ఞ బూనింది. అంతేకాక, గత రెండున్నర నెలల నుంచి గాజాకు ఆహారం, మందులు, చమురు సరఫరాను నిలిపివేసింది. దీంతో అక్కడి పౌరులు ఆకలితో అల్లాడుతున్నారు. ఐరాస, ఇతర అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి మేరకు మానవతా సాయాన్ని పాక్షికంగా ఇజ్రాయెల్ పునరుద్ధరించింది.