Benjamin Netanyahu | జెరూసలేం, అక్టోబర్ 18: హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను హతమార్చిన నేపథ్యంలో గాజా ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలను వదులుకొని, బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ అంగీకరిస్తే రేపే యుద్ధం ముగుస్తుందని ఆయన శుక్రవారం పేర్కొన్నారు. ‘యాహ్యా సిన్వర్ మరణించాడు. రఫాలో ధైర్యవంతులైన ఇజ్రాయెల్ సైనికులు ఆయనను చంపేశారు. అయితే, ఇది గాజాలో యుద్ధానికి ముగింపు మాత్రం కాదు. యుద్ధం ముగిసే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. హమాస్ ఆయుధాలను, బందీలను విడిచిపెడితే రేపే యుద్ధం ముగుస్తుంది. గాజా ప్రజలకు ఇది నా స్పష్టమైన సందేశం’ అని నెతన్యాహూ పేర్కొన్నారు. ప్రస్తుతం హమాస్ వద్ద ఇజ్రాయెల్ సహా 23 దేశాలకు చెందిన 101 మంది పౌరులు బందీలుగా ఉన్నారని నెతన్యాహూ తెలిపారు. బందీలను తిరిగి తీసుకురావడానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని, బందీలను అప్పగించిన వారి రక్షణకు తమది భరోసా అని పేర్కొన్నారు.
యాహ్యా సిన్వర్ మరణించిన విషయాన్ని హమాస్ శుక్రవారం ధ్రువీకరించింది. సిన్వర్ వీరోచిత అమరుడని, ఆయుధాన్ని వదలకుండా సైన్యాన్ని ముందుండి నడిపించారని హమాస్ ప్రతినిధి ఖలిల్ అల్ హయ్య ప్రకటించారు. కాగా, గాజాలో ఇజ్రాయెల్ కాల్పులను విరమించి, సైన్యాన్ని వెనక్కు తీసుకెళ్తే తప్ప బందీలను విడిచిపెట్టబోమని హమాస్ స్పష్టం చేసింది.
గాజా యుద్ధం ప్రారంభమైన ఏడాది కాలంలో హమస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను హతమార్చడం తమకు లభించిన భారీ విజయమని ఇజ్రాయెల్ ప్రకటించింది. తప్పించుకొనే క్రమంలో సిన్వర్ దక్షిణ గాజాలో ఒక ఇంటి నుంచి మరో ఇంటికి తన మకాం మారుస్తూ వెళ్తున్నాడని, ఈ క్రమంలో అతడిని వెంటాడి వేటాడామని తెలిపింది. ఇజ్రాయెల్‌లో గత ఏడాది అక్టోబర్ 7న మారణహోమం సృష్టించిన హమస్ ఉగ్రవాదుల కుట్రకు సిన్వర్ ప్రధాన సూత్రధారి అని పేర్కొంది. ఈ నెల 16న తమ దక్షిణ కమాండ్‌కు చెందిన సైనికులు సిన్వర్‌ను మట్టుబెట్టారని ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రాంతంలో గత ఏడాది నుంచి సిన్వర్ కోసం గాలింపు నిర్వహిస్తున్నామని పేర్కొంది. ఇటీవలి కాలంలో తాము వెతుకుతున్న ప్రదేశాల సంఖ్య తగ్గుతుండటం, సిన్వర్ నివాస ప్రాంతాన్ని తమ దళాలు చుట్టుముడుతుండటంతో ఇక అతడికి పారిపోయే అవకాశం లేకపోయిందని వివరించింది. ఒక ఇంటిలో నివసిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను తమ 828 బ్రిగేడ్‌కు చెందిన సైనికులు గుర్తించి, దాడి చేశారని తెలిపింది. దాడుల అనంతరం వెళ్లి పరిశీలించగా, అక్కడ సిన్వర్ హతమై ఉన్నాడని పేర్కొంది. రఫా జిల్లాలో సిన్వర్తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి హగారీ ధ్రువీకరించారు. తమ దళాలు గాలింపు జరుపుతుండగా ముగ్గురు ఉగ్రవాదులు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి పారిపోతూ కనిపించారని చెప్పారు. తమ దళాలు వారిపై కాల్పులు జరుపడంతో సిన్వర్ ఒంటరిగా మరో ఇంట్లోకి వెళ్లిపోయాడని తెలిపారు. అతడున్న ఇంటిని డ్రోన్ సాయంతో స్కాన్ చేశామని, తన ఎదుటికి వచ్చిన డ్రోన్‌పైకి సిన్వర్ ఒక కర్రను విసిరాడని వివరించారు. సిన్వర్ మరణించిన ప్రదేశంలో ఇజ్రాయెల్‌కు చెందిన బందీలెవరూ లేరని చెప్పారు. సిన్వర్ మృతదేహం వద్ద ఒక గన్, 40వేల షెకెల్స్ (పాలస్తీనా కరెన్సీ) లభించాయని తెలిపారు.