టెల్అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరపోరు కొనుగుతున్నది. హమాస్ దాడి నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో (Gaza Strip) ఆ సంస్థ ఉనికే లేకుండా చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ (Israel) సైన్యాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గాజాపై హమాస్ (Hamas) పట్టు కోల్పోయిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంత్ (Defence Minister Yoav Gallant) ప్రకటించారు. ఇలా జరగడం గత 16 ఏండ్లలో ఇదే మొదటిసారని చెప్పారు. ఉగ్రవాదులంతా దక్షిణ గాజావైపు పారిపోతున్నారని వెల్లడించారు. దీంతో ప్రజలంతా హమాస్ స్థావరాలను ఆక్రమిస్తున్నారని చెప్పారు. గాజా ప్రజలకు అక్కడి ప్రభుత్వం ఏ మాత్రం నమ్మకం లేదని పేర్కొన్నారు. అయితే గాజాపై హమాస్ పట్టు కోల్పోయిందనడానికి ఆయన ఎలాంటి ఆధారాలను చూపకపోవడం గమనార్హం.

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో 1200 మంది మరణించారు. మరో 240 మందిని బంధీలుగా పట్టుకెళ్లారు. దీంతో హమాస్ స్థావరంగా ఉన్న గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. దీంతో ఇప్పటివరకు గాజా స్ట్రిప్‌లో 11,240 మంది మరణించారని వారిలో 4630 మంది చిన్నారులు ఉన్నారని హమాస్ వెల్లడించింది. ఇజ్రాయెల్ సైన్యం విచక్షణా రహితంగా దాడులు చేస్తుండటంతో గాజాలోని సగం మందికిపైగా నిరాశ్రయులయ్యారు. రెండు లక్షల మందికిపైగా సాధారణ ప్రజలు పొట్టచేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. చాలామంది తిండీ నీరు అందక అల్లాడుతున్నారు. ఇక గాజాలోని దవాఖానల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు.