దుబాయ్, జూన్ 14: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా మారుతున్నది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. శనివారం ఉదయం ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు మరణించగా, డజన్లకొద్దీ పౌరులు గాయపడ్డారు. టెల్ అవీవ్, జెరూసలేం నగరాలు లక్ష్యంగా ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. పలుచోట్ల భారీగా ఆస్తి నష్టం సంభవించింది. తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను టెల్ అవీవ్‌పైకి పంపిన ఇరాన్.. ఆ తర్వాత వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. అంతకుముందు రోజు ఇజ్రాయెల్ రెండు దఫాలుగా ఇరాన్‌లోని సుమారు 300 లక్ష్యాలపై దాడులు చేసింది. ఇరాన్‌లోని అణు స్థావరాలు, మిలిటరీ కేంద్రాలు లక్ష్యంగా ఈ దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతోపాటు, డ్రోన్లను కూడా ఉపయోగించింది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది మరణించారని, 320 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి వెల్లడించారు. మృతుల్లో పలువురు ఉన్నత సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలు ఉన్నట్టు తెలిపారు. శనివారం కూడా ఇజ్రాయెల్ పలుమార్లు ఇరాన్‌లోని లక్ష్యాలపై దాడులు చేసినట్టు ఇర్నా వార్తా సంస్థ తెలిపింది. బోరుజెర్డ్లోని కార్ల తయారీ కంపెనీ, ఖుజెస్థాన్ ప్రావిన్స్‌లోని అబాదాన్లో పేలుళ్లు సంభవించినట్టు పేర్కొంది. కెర్మాన్షాలోని మిలిటరీ బరాక్స్ వద్ద కూడా దాడులు జరిగినట్టు తెలిపింది. ఇరాన్ దాడుల్లో తమ ఏడుగురు సైనికులు గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్‌లోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శనివారం కూడా మూసివేశారు.
తమ దేశంపై క్షిపణి దాడులు కొనసాగిస్తే టె హ్రాన్ తగలబడుతుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ శనివారం ఇరాన్‌ని హెచ్చరించారు. ఇరాన్ శనివారం ఉదయం ప్రతీకార దాడులు జరిపిన దరిమిలా ఆయన ఈ హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ ప్రజలను ముఖ్యంగా టెహ్రాన్ వాసులను బందీలుగా చేసుకుని వారి ప్రాణాలను ఇరాన్ నియంత పణంగా పెడుతున్నార ని, ఇజ్రాయెల్ పౌరులపై జరిగే నేరపూరిత దాడులకు టెహ్రాన్ ప్రజలు మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని కట్జ్ హెచ్చరించారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు ఉగ్రరూపం దాలుస్తున్న వేళ ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ నివాసం సమీపంలో, దేశాధ్యక్షుడి కార్యాలయం సమీపంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇందుకు సంబంధించి గగతల రక్షణ కార్యకలాపాలతో కూడిన వీడియో ఒకటి శనివారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. శుక్రవారం అర్ధరాత్రి, శనివారం తెల్లవారుజామున ఖమేనీ నివాస ప్రాంగణంలో, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కార్యాలయం సమీపంలో భారీ పేలుళ్లు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ మీడియా తెలిపింది. ఇరాన్‌లోని అనేక ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు తీవ్ర స్థాయిలో జరుగుతున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇజ్రాయెలీ డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసేందుకు ఇరానియన్ రక్షణ వ్యవస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలిపింది. ఇరాన్‌పై ప్రస్తుత సైనిక దాడికి రైజింగ్ లయన్ అని ఇజ్రాయెల్ నామకరణం చేయగా ఇజ్రెయెల్పై తన ప్రతీకార దాడికి ఇరాన్ ట్రూ ప్రామిస్ 3 ఆపరేషన్ అని పేరు పెట్టింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో తమ ఇండ్ల పైకి ఎక్కి స్థానికులు ‘నియంతకు చావు తప్పదు’, ‘ఖమేనీకి చావు తప్పదు’ అంటూ నినాదాలు చేస్తున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ శనివారం వెల్లడించింది. కాగా, శనివారం దేశ ప్రజలను ఉద్దేశించి ఖమేనీ ముందుగానే రికార్డు చేసిన సందేశాన్ని వినిపిస్తూ ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు కొనసాగుతాయని వాగ్దానం చేశారు. ఇరాన్ సైన్యం స్పందించడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. వాళ్లు దాడి చేశారు, అం తా అయిపోయిందని భావించవద్దని, ముందు గా దాడి చేసి ఘర్షణను వాళ్లే మొదలుపెట్టారని, ఈ తప్పుడు పనికి వాళ్లు పర్యవసానాలను తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు.
ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడులలో ఇరాన్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులు మరణించినట్లు ఇరానియన్ ప్రభుత్వ టెలివిజన్ శనివారం ప్రకటించింది. మరణించిన ఇద్దరు సైనిక జనరల్స్ పేర్లను ప్రకటించిన టీవీ వారు ఎక్కడ మరణించిందీ వెల్లడించలేదు. కాగా, శుక్రవారం ఇజ్రాయెల్ సాయుధ దళాలు జరిపిన వైమానిక దాడులలో ఇరాన్ ఆర్మీకి చెందిన చీఫ్ ఆఫ్ స్టాఫ్, పారామిలిటరీ రివల్యూషనరీ గార్డు అధిపతితో సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారు.
ఇజ్రాయెల్‌కు సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. తాము ఇజ్రాయెల్‌పై చేస్తున్న దాడులను ఆపడానికి ప్రయత్నించవద్దని సూచించింది. లేకపోతే పశ్చిమాసియాలోని ఆయా దేశాల సైనిక స్థావరాలు, నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.
ఇజ్రాయెల్ తమపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇక అమెరికాతో అణు చర్చలు జరపడం అర్థరహితమని ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఒమన్‌లో ఆదివారం అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య అణు చర్చలు కొనసాగాల్సి ఉన్నది. అమెరికా చర్యలు అణు చర్చలను అర్థరహితం చేశాయి అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘేయి వ్యాఖ్యానించారు. అయితే చర్చలు రద్దయ్యాయా లేదా అన్నదానిపై మాత్రం ఆయన స్పష్టతనివ్వలేదు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదారులు కొనసాగేంత వరకు ఇజ్రాయెల్‌కు చెందిన ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ఆ దేశ ఎయిర్‌పోర్టు అథారిటీ శనివారం ప్రకటించింది. టెల్ అవీవ్ సమీపంలోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసినట్లు సంస్థ తెలిపింది.
ఇరాన్‌పై సైనిక చర్యను కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ ప్రజలనుద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో ఆయన ‘మరిన్ని దాడులు జరుగుతాయి’ అని చెప్పారు. గత 24 గంటల్లో ఇరాన్‌కు చెందిన పలువురు సైనిక కమాండర్లను, సీనియర్ అణు శాస్త్రవేత్తలను హతమార్చామని తెలిపారు. ఇరాన్‌లోని ప్రముఖ అణు కేంద్రాలను, ఖండాంతర క్షిపణుల ఆయుధాగారాలను ధ్వంసం చేశామని అన్నారు. ‘ఎక్కడ నష్టం జరిగిందో లేదా ఇంకా ఎక్కడ జరుగనున్నదో ఇరాన్ పాలకులకు ఇంకా తెలియడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రజలు తమ పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని నెతన్యాహు పిలుపునిచ్చారు. తమ జాతీయ పతాకం చుట్టూ, తమ చారిత్రక వారసత్వ కోసం ఇరాన్ ప్రజలు ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది అని అన్నారు. దాదాపు 50 ఏండ్లుగా సాగుతున్న దుష్ట, నియంతృత్వ పాలన నుంచి స్వాతంత్య్రం కోసం ఐక్యంగా నిలవాలని కోరారు. ఇజ్రాయెల్‌కు పొంచి ఉన్న అణ్వాయుధ, ఖండాంతర క్షిపణుల ముప్పును తొలగించడమే తమ సైనిక చర్య వెనుక ముఖ్య ఉద్దేశమని స్పష్టంచేశారు.
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోప్ లియో పిలుపునిచ్చారు. వాటికన్లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడు తూ..అణ్వాయుధ ముప్పు నుంచి సురక్షిత ప్రపంచ నిర్మాణం కోసం ప్రయత్నించాలని అన్నారు. ఇందుకు చిత్తశుద్ధితో చర్చలు జరపాలని కోరారు. ఒక దేశం మనుగడను మరొక దేశం ప్రశ్నార్థకంగా మార్చరాదని అన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్‌లు వెంటనే పరస్పర దాడులను ఆపాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్రెస్ పిలుపునిచ్చారు. ఇప్పటివరకు పెరిగిన ఉద్రిక్తతలు చాలని, ఇక ఆపాలని అన్నారు. శాంతి, దౌత్యం వర్ధిల్లాలి అని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మధ్యనున్న సిరియా, ఇరాక్ జోర్డాన్ దేశాలు తమ వైమానిక మార్గాలను మూసివేశాయి. అయితే శనివారం కొద్దిసేపు దాడులకు విరామం లభించడంతో వైమానిక మార్గాన్ని తెరిచినట్టు సిరియా సివిల్ ఏవియేషన్ సంస్థ తెలిపింది. కొన్ని విమానాల రాకపోకలను పునరుద్ధరించినట్టు పేర్కొంది. లెబనాన్ వైమానిక మార్గాలను శనివారం ఉదయం ప్రారంభించినట్టు తెలిపింది. విమానాలను నిలిపివేసినందుకు ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. జోర్డాన్ కూడా విమానాల రాకపోకలను ప్రారంభించినట్టు తెలిపింది.