న్యూఢిల్లీ: ఇజ్రాయిల్‌పై హమాస్ చేసిన అటాక్‌తో ఆ దేశం తీవ్ర ఒత్తిడిలో ఉంది. హమాస్-ఇజ్రాయిల్ మధ్య ఘర్షణలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కానీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యూ కుమారుడు యాయిర్ నెతాన్యూ(Yair Netanyahu)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బెంజిమన్ కుమారుడు యాయిర్ స్వదేశంలో లేకపోవడం పట్ల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు హమాస్ భీకర దాడులు చేస్తుంటే.. ప్రధాని కుమారుడు మాత్రం అమెరికా బీచుల్లో తిరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అక్టోబర్ 7వ తేదీన హమాస్ చేసిన అటాక్‌కు కౌంటర్‌గా ప్రస్తుతం ఇజ్రాయిల్ గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టింది. దీనిలో భాగంగా సుమారు నాలుగు లక్షల మంది ఆ దేశ యువత హమాస్‌పై పోరాటానికి సిద్దమైంది. కానీ ప్రధాని బెంజిమన్ కుమారుడు యాయిర్ స్వదేశంలో లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్-హమాస్ అటాక్‌లో దాదాపు అయిదు వేల మంది మరణించారు. అయితే యాయిర్ నెతాన్యూ మాత్రం అమెరికాలోని ఫ్లోరిడాలో సేద తీరడాన్ని తప్పుపడుతున్నారు. 32 ఏళ్ల యాయిర్ ఇటీవల ఫ్లోరిడా బీచ్‌లో ఉన్న ఓ ఫోటో వైరల్ అయ్యింది. మియామిలో అతను ఎంజాయ్ చేయడాన్ని కొందరు విమర్శిస్తున్నారు.
ఇజ్రాయిల్ నార్త్ ఫ్రంట్‌లో ఉన్న సైనికులు నెతాన్యూ కుమారుడి పట్ల ఆగ్రహంతో ఉన్నారు. మేం యుద్ధ క్షేత్రంలో ఉండగా, ప్రధాని కుమారుడు మాత్రం బీచ్‌ల్లో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఓ సైనికుడు ఆరోపించాడు. కుటుంబాలను రక్షించుకునేందుకు తాము పోరాటం చేస్తున్నామని, కానీ ప్రస్తుత పరిస్థితి ఆ వ్యక్తులు కారణం కాదు అని ఆ సైనికుడు తెలిపారు. గాజాతో ఉన్న బోర్డర్లో పనిచేస్తున్న ఓ సైనికుడు కూడా తన నిరుత్సాహాన్ని వ్యక్తం చేశాడు. దేశం కోసం అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు వచ్చేశానని, దేశ ప్రజల్ని వదిలేసి, అక్కడ నేనుండడం సమంజసం కాదు అని, ప్రధాని బెంజిమన్ కుమారుడు ఎక్కడున్నాడని, అతనెందుకు ఇజ్రాయిల్‌లో లేడని ఆ సైనికుడు ప్రశ్నించాడు.
బెంజిమన్ నెతాన్యూ మూడవ భార్య సారాకు పుట్టిన కుమారుడే యాయిర్. తన తండ్రిని సమర్థించడంలో ఆయన దిట్ట. సోషల్ మీడియాలో యాంటీ ఇస్లామిక్ పోస్టులో చేయడంలో యాయిర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ముస్లింలు ఇజ్రాయిల్ నుంచి వెళ్లిపోయే వరకు శాంతి ఉండదని అతను 2018లో చేసిన పోస్టు వల్ల ఫేస్బుక్ అకౌంట్‌ను బ్లాక్ చేశారు. పాలస్తీనియన్లు అని చెప్పుకుంటున్నవారి వల్ల శాంతి ఉండదని మరో పోస్టులో కామెంట్ చేశారు. ఓ రాజకీయ వేత్తకు ఓ మహిళతో రిలేషన్ ఉందని కామెంట్ చేసిన కేసులో అతనికి 34 వేల డాలర్లు జరిమానా విధించారు.