దుబాయ్, జూన్ 19: ఇజ్రాయెల్ భౌతిక దాడులతో అల్లాడుతున్న ఇరాన్‌పై ఇప్పుడు భారీ సైబర్ దాడి జరిగింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్న కొందరు హ్యాకర్లు ఇరాన్‌లోని అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్‌పై దాడి చేసి 90 మిలియన్ల యూఎస్ డాలర్లను కొల్లగొట్టినట్టు బ్లాక్‌చెయిన్ అనలిటిక్స్ సంస్థలు వెల్లడించాయి. హ్యాకింగ్‌కు బాధ్యత వహించిన గ్రూప్ గురువారం కంపెనీ పూర్తి సోర్స్ కోడ్‌ను లీక్ చేసింది.
‘నోబిటెక్స్లో మిగిలి ఉన్న ఆస్తులు ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి’ అని ఆ గ్రూప్ టెలిగ్రామ్ ఖాతాలో రాసింది. ఇరాన్ వేగంగా నిర్వహిస్తున్న అణు కార్యక్రమంపై విధించిన పాశ్చాత్య ఆంక్షలను తప్పించుకోవడానికి, ఉగ్రవాదులకు డబ్బును బదిలీ చేయడానికి నోబిటెక్స్ సహాయపడిందని ‘దోపిడీ పిచ్చుక’ పేరుతో వారు ఎక్స్‌లో ప్రకటన చేశారు. కాగా, సైబర్ దాడిని నోబిటెక్స్ నిర్ధారించింది.