యుద్ధంలో చేరాలని అగ్రరాజ్యానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి
పశ్చిమాసియాలో ఫైటర్జెట్లు మోహరిస్తున్న బ్రిటన్
మాపై దాడి చేస్తే కనీవినీ ఎరుగని రీతిలో స్పందిస్తాం
టెహ్రాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్యే జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా, బ్రిటన్ కూడా రంగంలోకి దిగొచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో తమ యుద్ధ విమానాలను మోహరిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది.
World War -3 | న్యూఢిల్లీ, జూన్ 15: ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య మొదలైన యుద్ధ వాతావరణం క్రమంగా ప్రపంచ యుద్ధం దిశగా మారుతున్నది. రెండు దేశాలతో పాటు ఆయా పక్షాల వైపు ప్రపంచ దేశాలు తమ సైనిక శక్తిని మోహరిస్తుండటం గుబులురేపుతున్నది. ఇరాన్‌పై యుద్ధంతో తమతో కలవాలని అగ్రరాజ్యం అమెరికాకు ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసినట్టు ఇద్దరు ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ‘ఆక్సియోస్’ తన వార్తా కథనంలో పేర్కొంది. ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్రాన్ని లోతైన భూగర్భంలో నిర్మించారని, అయితే దానిని ధ్వంసం చేసే శక్తి సామర్థ్యాలు తమకు లేవని, అమెరికా కనుక తమతో యుద్ధంలో కలిస్తే వాటిని సులభంగా ధ్వంసం చేయవచ్చునని ఇజ్రాయెల్ కోరింది. కాగా, ఆ అణు కేంద్రానికి సమీపంలోనే అమెరికన్ తన బాంబర్లను మోహరించిందని ఆ మీడియా సంస్థ వెల్లడించింది. ఆ అణు కేంద్రంపై కనుక అమెరికా దాడికి దిగితే అగ్రరాజ్యం కూడా యుద్ధంలో నేరుగా పాల్గొన్నట్టే. అవసరమైతే తాము నేరుగా యుద్ధంలో అడుగుపెడతామని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ట్రంప్ హామీ ఇచ్చారని ఆ వార్తాసంస్థ తెలిపింది. కాగా, తమతో యుద్ధంలో పాల్గొనమని ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసిన మాట వాస్తవమేనని, దానిని తాము తిరస్కరించామని అమెరికా అధికారులు తెలిపారు. సాధ్యమైనంత వరకు చర్చల ద్వారా శాంతియుతంగానే సమస్యను పరిష్కరించేందుకు ట్రంప్ కృషి చేస్తారని పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య తీవ్రమైన పోరు జరుగుతున్న క్రమంలో జెట్లు, ఇతర మిలిటరీ సామగ్రిని తాము పశ్చిమాసియాకి తరలిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్మార్టర్ తెలిపారు. అయితే తాము ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడాన్ని ఆయన తోసిపుచ్చుతూ తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే తాము వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో అత్యవసర సహాయం కోసమే తాము జెట్లు, ఇతర సామగ్రిని తరలించామని ఆయన పేర్కొన్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫ్రాన్స్ అప్రమత్తమైంది. తమ భూభాగంలో యూదులు, అమెరికన్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా ప్రార్థనాస్థలాలు, పాఠశాలలు, విద్యాసంస్థలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు మత సంబంధమైన సమావేశాలు జరిగే ప్రాంతాలపై నిఘా పెంచాలని ఫ్రాన్స్ మంత్రి బ్రూనో ఆదేశించారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో అమెరికాకు ఎలాంటి పాత్ర లేదని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తమ స్థావరాలపై ఇరాన్ ఎలాంటి ప్రతీకార దాడులకు పాల్పడినా కనీవినీ ఎరుగని స్థాయిలో చర్యలు తీవ్రంగా ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. ‘ఇరాన్ మాపై ఏ విధంగానైనా, ఏ రూపంలోనైనా దాడి చేస్తే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అమెరికా సాయుధ దళాలు పూర్తి బలం, శక్తితో మీ పైకి వస్తుంది’ అని ఆయన హెచ్చరించారు. శనివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అమెరికాకు ఎలాంటి ప్రమేయం లేదని ఆయన తన ట్రూత్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఆదివారం అమెరికాతో జరగాల్సిన ఆరో విడత అణు చర్చలను టెహ్రాన్ రద్దు చేసుకున్నప్పటికీ తాను ఈ రెండు దేశాల మధ్య ఏర్పడిన సంక్షోభాన్ని సులభంగా పరిష్కరించగలనని ఆయన అన్నారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వాయుసేనతో దాడులు ప్రారంభించగానే గతంలో ఎన్నడూ లేని విధంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఈసారి ఏర్పడనున్నాయని అమెరికాకు చెందిన ఒక ఉన్నతాధికారి హెచ్చరించారు. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ యుద్ధానికి దగ్గరలో ఉందని, ప్రస్తుత మూడో ప్రపంచ యుద్ధ ముప్పు ప్రచ్ఛన్న యుద్ధ యుగం కంటే కూడా ప్రమాదరమైనదని, ఆ ముప్పు దగ్గరలోనే ఉందని వాషింగ్టన్ పోస్ట్ నివేదిక పేర్కొంది.