Israel-Hamas War | జెరూసలేం/గాజా సిటీ, అక్టోబర్ 11: ఇజ్రాయెల్, హమాస్ గ్రూపు మధ్య యుద్ధం తీవ్రమవుతున్నది. గాజా సరిహద్దును ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకొని, గాజాలోకి ఆహారం, నీరు, విద్యుత్తు, ఇతరత్రా వంటివి సరఫరా కాకుండా దిగ్బంధించిన నేపథ్యంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం గాజాలో ఉండే ఏకైన పవర్ ప్లాంట్‌కు ఇంధన కొరత ఏర్పడి, విద్యుత్తు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో దవాఖానల్లో కూడా సంక్షోభ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తున్నది. దాడుల్లో గాయపడిన వేలాది మంది దవాఖానల్లో చికిత్స తీసుకొంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో డీజిల్ ఉన్నవారు విద్యుత్తు కోసం జనరేటర్లపై ఆధారపడుతున్నారు. అంతకుముందు ఇంధన కొరత కారణంగా విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోతుందని, ఇది గాజాను పూర్తిగా అంధకారంలోకి నెట్టివేస్తుందని, ప్రాథమిక సేవలు అందించేందుకు అసాధ్యమవుతుందని గాజా ఎనర్జీ అథారిటీ పేర్కొన్నది.
ఇజ్రాయెల్ దాడులు, దిగ్భందనంతో గాజా స్ట్రిప్ వణుకుతున్నది. మంగళవారం రాత్రి గాజాలోని 200 ప్రాంతాలపై యుద్ధ విమానాలతో దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఓవైపు వైమానిక దాడులతో వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమవుతుండంతో గాజాలోని పాలస్తీనియన్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. భవనాల శిథిలాల కింద మృతదేహాలు భారీ సంఖ్యలో ఉండే అవకాశం ఉన్నదని స్థానిక అధికారులు చెబుతున్నారు. యుద్ధంలో ఇప్పటివరకు ఇరువైపులా 3600మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఖాన్ యూనిస్ పట్టణంపై ఇజ్రాయెల్ జరిగిన దాడుల్లో హమాస్ సీనియర్ కమాండర్ మహ్మద్ డెయిఫ్ సోదరుడు అబ్దుల్ ఫతా మరణించాడని హమాస్ అనుబంధ మీడియా తెలిపింది. హమాస్ మిలటరీ వింగ్ అల్-అక్సా బ్రిగేడ్స్ కమాండ్‌గా ఉన్న డెయిఫ్‌ను హతమార్చేందుకు ఇజ్రాయెల్ గతంలో పలుమార్లు ప్రయత్నించింది. మరోవైపు, హమాస్ విమాన నిఘావ్యవస్థను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది.
హమాస్ మిలిటెంట్లను పూర్తిస్థాయిలో మట్టుపెట్టేందుకు కొన్నేండ్లుగా అనుసరిస్తున్న ‘నాక్ ఆన్ ది రూఫ్’ విధానానికి ఇజ్రాయెల్ స్వస్థి పలికే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నది. ఈ విధానం ప్రకారం ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం లేదా ఆయుధాలు దాచిన ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని బాంబు దాడికి పాల్పడే ముందు సంబంధిత యజమానులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు చేస్తుంది. 5 నిమిషాల్లో భవనాన్ని ఖాళీ చేయాలని, సాధారణ ప్రజలు పారిపోవాలని ఆదేశిస్తుంది. వారు వెళ్లకుంటే బాంబులు వేయదు. అయితే ఈ విధానాన్ని హమాస్ మిలిటెంట్లు తమకు అనుకూలంగా మార్చుకొన్నది. ఇజ్రాయెల్ హెచ్చరికలు చేసినా, ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోనివ్వకుండా చేస్తూ తమ అడ్డాగా మార్చుకొన్నాయి. ఇప్పుడు ఈ నాక్ ఆది ది రూఫ్ విధానానికి ఇజ్రాయెల్ స్వస్తి పలికితే భారీ మారణ హోమం తప్పదనే వాదనలు వస్తున్నాయి.
గాజా రీజియన్‌పై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్) నిషేధిత తెల్ల భాస్వరం(వైట్ పాస్పరస్) బాంబులను వినియెగిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ తెల్ల భాస్వరానికి మండే స్వభావం అధికంగా ఉంటుంది. గాలితో కలసినప్పుడు ఇది మరింత వేగంగా, ప్రకాశవంతంగా మండుతుంది. రసాయన చర్య నుంచి దాదాపు 815 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, కాంతి, పొగ విడుదల అవుతుంది. దీన్ని రాత్రిపూట లక్ష్యాలను కనిపించేలా చేయడం, కేవలం శత్రువులకు మాత్రమే నష్టం కలిగించడం వంటి వివిధ కారణాలతో అమెరికాతో పాటు పలు దేశాల సైన్యాలు కూడా మండే స్వభావం ఉండే ఆయుధాల్లో వినియోగిస్తుంటాయి.
యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని అధికార, విపక్షాలు ఎమర్జెన్సీ యూనిటీ గవర్నమెంట్‌ను ఏర్పాటుచేశాయి. మాజీ రక్షణమంత్రి, ప్రతిపక్ష నాయకుడు బెన్నీ గాంట్జ్‌తో కలిసి వార్ క్యాబినెట్ ఏర్పాటుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అంగీకారం తెలిపారు. పూర్తిగా యుద్ధంపైనే వీరు దృష్టిసారించనున్నారు.
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ చేపట్టింది. ప్రత్యేక చార్టర్డ్ విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. భారత్‌కు వచ్చేందుకు ఇప్పటికే రిజస్టర్ చేసుకున్నవారికి సందేశం ఇచ్చామని, తొలి ఫ్లైట్ నేడు భారత్‌కు చేరుకోనున్నట్టు వెల్లడించారు. మరోవైపు, భారతీయ పౌరుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటుచేసినట్టు అక్కడి ఎంబసీ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో +972-35226748, +972-543278392 నంబర్లకు ఫోన్ చేయాలని, cons1.telaviv@mea.gov.in మెయిల్ చేయాలని సూచించింది. కోరింది. ఇజ్రాయెల్‌లో 18 వేల మంది భారతీయులు ఉన్నారు.
ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో ఒక వైపు హమాస్‌తో, మరోవైపు ఉత్తరప్రాంతంలో లెబనాన్ హెజ్బొల్లా గ్రూపు, సిరియా భూభాగం నుంచి దాడులు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. మంగళవారం సిరియా భూభాగం నుంచి మోర్టాల్ సెల్స్‌ను ప్రయోగించారని, అవి బహిరంగ ప్రాంతంలో పడ్డాయని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. దీనికి ప్రతిగా తాము కూడా ఆర్టిలరీ, మోర్టాల్స్ సెల్స్ ప్రయోగించామని తెలిపింది. హమాస్‌కు మద్దతుగా యుద్ధ రంగంలోకి దిగిన లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు ప్రాంతంలో యాంటీ ట్యాంక్ క్షిపణి దాడి చేసింది. దీనికి ప్రతిగా ఆ గ్రూపు స్థావరంపై వైమానిక దాడి చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.