Robotic Guns | ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని రెండు అస్థిర ప్రదేశాల్లో రోబోటిక్ ఆయుధాలను ఇజ్రాయెల్ మోహరించింది. పాలస్తీనా నిరసనకారులపై టియర్ గ్యాస్, స్టన్ గ్రనేడ్లు, స్పాంజ్-టిప్డ్ బుల్లెట్లను ప్రయోగించేందుకు ఈ రోబోటిక్ ఆయుధాలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తున్నది.
రద్దీగా ఉండే పాలస్తీనా శరణార్థుల శిబిరంపై, ఫ్లాష్‌పాయింట్ వెస్ట్ బ్యాంక్ నగరంలో ఉన్న ఆయుధాల లక్ష్యాలను ట్రాక్ చేయడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నట్లుగా సమాచారం.
స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఇజ్రాయెల్‌లో తొలిసారిగా మత ఛాందసవాద ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఆ దేశ సరిహద్దులో మూడు రోబోటిక్ గన్లను ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో రెండు పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య వివాదాస్పద భూభాగమైన వెస్ట్ బ్యాంక్‌లో ఉన్నాయి. ఇక్కడ పాలస్తీనియన్లు తరచుగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ రోబోటిక్ గన్ల ద్వారా టియర్ గ్యాస్, స్మోక్ గ్రెనేడ్ (స్మోక్ బాంబ్), స్పాంజ్ బుల్లెట్లతో నిరసనకారులను అణగదొక్కేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో లక్ష్యాలను నిర్దేశించే ఈ తుపాకులు ప్రాణాంతకం కాదు, కానీ ఘోరమైనవని పేర్కొనవచ్చు.
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ కొత్త ఆయుధ వ్యవస్థను తీసుకొచ్చినట్లుగా తెలుస్తున్నది. 2006 నుంచి ఇక్కడ వాతావరణం మరింతగా క్షీణించింది. దాదాపు నెల రోజుల క్రితం మిలిటరీ రోబోట్లను సరిహద్దు సమీపంలోని హెబ్రోన్ నగరంలో ఇజ్రాయెల్ ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థను వెస్ట్ బ్యాంక్‌లో మరో ప్రదేశంలో మోహరించే ప్రణాళికలపై వ్యాఖ్యానించడానికి సైన్యం నిరాకరించింది.