IDF | జెరూసలేం, అక్టోబర్ 3: మూడు నెలల క్రితం జరిపిన ఓ దాడిలో గాజాస్ట్రిప్‌లో హమాస్ ప్రభుత్వాధినేత రౌహి ముష్తాహను హతమార్చినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గురువారం ప్రకటించింది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి ఈ దాడి చేశామని, ఇందులో రౌహితో పాటు హమాస్ పొలిటికల్ బ్యూరో భద్రత బాధ్యతలు చూసే సమేహ్ అల్ సిరాజ్, కమాండర్ సమీ ఔదేహ్ను హతమార్చినట్టు వెల్లడించింది. హమాస్ సీనియర్ నేతల్లో ముష్తాహ ఒకరని, హమాస్ ఉగ్రనేత యాహ్య సిన్వర్‌కు కుడిభుజంగా అతడిని భావిస్తారని తెలిపింది. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి పాల్పడి, 1,205 మంది ఇజ్రాయెలీలను హతమార్చింది. అప్పటి నుంచి గాజాపై దాడులను ప్రారంభించిన ఇజ్రాయెల్ వేలాదిమంది హమాస్ మిలిటెంట్లతో పాటు కీలక నేతలను మట్టుబెట్టింది.
లెబనాన్‌లోని సెంట్రల్ బీరుట్లో గురువారం తెల్లవారుజామున ఓ అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం, పార్లమెంటు, ఐరాస కార్యాలయానికి కూతవేటు దూరంలోనే జరిగిన ఈ పేలుడులో తొమ్మిది మంది మరణించారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో హెజ్బొల్లా సభ్యులతో పాటు సాధారణ ప్రజలు, సహాయక చర్యల్లో ఉన్న వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. బెల్జియంకు చెందిన ఇద్దరు జర్నలిస్టులకు ఈ ఘటనలో గాయాలయ్యాయి. కాగా, పేలుడు తర్వాత సల్ఫర్ లాంటి వాసన వచ్చినట్టు స్థానికులు పేర్కొన్నారు. దీంతో ఇజ్రాయెల్ ఫాస్పరస్ బాంబులను ఉపయోగిస్తున్నదని లెబనాన్ అధికారిక జాతీయ వార్తా సంస్థ ఆరోపించింది. బుధవారం దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా జరిపిన దాడిలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించడంతో దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ మరింత పెంచింది. కాగా, ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఆ దేశ సైనికులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాదాపు 20 క్షిపణులు, రాకెట్లతో దాడి చేసినట్టు హెజ్బొల్లా ప్రకటించింది. దక్షిణ లెబనాన్‌లో మరౌన్ అల్రౌస్లో ఇజ్రాయెల్ సైనికుల బృందంపై బాంబు దాడి చేశామని పేర్కొన్నది. ఈ దాడిలో ఇజ్రాయెల్ సైనికులు కొందరు మరణించారని తెలిపింది.
ఇజ్రాయెల్ ప్రధాన నగరం టెల్ అవీవ్‌పై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడి చేశారు. గురువారం ఉదయం టెల్ అవీవ్‌లోని తమ కీలక లక్ష్యాలపై డ్రోన్లతో దాడులు చేసినట్టు హౌతీలు ప్రకటించారు. తమ దాడి విజయవంతమైందని, డ్రోన్లు లక్ష్యాలను చేరుకున్నాయని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లా చీఫ్ హస్సన్ నస్రల్లా మృతికి ముందు జరిగిన సంఘటనలపై లెబనాన్ విదేశాంగ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్ కీలక విషయాలు వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా అంగీకరించినట్టు చెప్పారు. నస్రల్లాను లెబనాన్ హౌజ్ స్పీకర్ నబిహ్ బెర్రీ సంప్రదించగా కాల్పుల విరమణకు ఆయన అంగీకరించారని తెలిపారు. నెతన్యాహూ సైతం 21 రోజుల కాల్పుల విరామణకు అంగీకరించారని అన్నారు. అయితే, నెతన్యాహూ మనసు మార్చుకొని పోరాటాన్ని కొనసాగించాలని బలగాలకు చెప్పారని, తర్వాత నస్రల్లాను హతమార్చారని తెలిపారు.
ఒకవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నదనే వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను ఇరాన్ తన హిట్‌లిస్టులో చేర్చిందని తెలుస్తున్నది. నెతన్యాహూతో పాటు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్, ఆ దేశ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల కమాండర్లు ఇరాన్ హిట్‌లిస్టులో ఉన్నారని పేర్కొంటూ ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ హిట్లిస్టుపై ఇజ్రాయెల్ స్పందించలేదు. అయితే, తమ లక్ష్యం నెతన్యాహూ కాకపోవచ్చని, ఇతర ఇజ్రాయెల్ సీనియర్ లీడర్లను లక్ష్యంగా చేసుకోవచ్చని ఇరాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.