Benjamin Netanyahu : అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోనుంది. అయితే, ఈ విషయంలో ఇజ్రాయెల్ వైఖరి మాత్రం భిన్నంగా ఉంది. తాము లెబనాన్, గాజా, సిరియాల నుంచి తమ సైన్యాన్నిమాత్రం ఉపసంహరించేది లేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రయెల్ కట్జ్ సోమవారం కీలక ప్రకటన చేశారు. తమ ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్)కు చెందిన దళాలు ఇంకా లెబనాన్, సిరియా, గాజాలోనే ఉంటాయన్నారు.
‘‘ఈ అంశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, నేను స్పష్టమైన వైఖరితో ఉన్నాం. లెబనాన్, సిరియా, గాజాలోని సరిహద్దు రక్షణ జోన్లలో ఐడీఎఫ్ దళాలు పూర్తికాలం ఉంటాయి. ఆయా దేశాల ఉగ్రవాద, జిహాదీ చర్యల నుంచి మా దేశ సరిహద్దును, ప్రజల్ని రక్షించుకునేందుకు దళాలు కొనసాగుతాయి. ఈ ప్రాంతంలో స్థానికులు కూడా ఉండరు. అక్కడి నేలపై, భూగర్భం లోపల తీవ్రవాదుల్ని, వారికి సంబంధించిన అన్ని నిర్మాణాల్ని అంతం చేస్తాం. వారికి ఆశ్రయమిస్తూ, తీవ్రవాద కేంద్రాలుగా ఉన్న సరిహద్దు గ్రామాల్ని కూడా ధ్వంసం చేస్తాం. ఈ ప్రాంతాల్ని స్వాధీనం చేసుకుని, ఐడీఎఫ్ ఆధ్వర్యంలో రక్షణ జోన్లుగా ఉంచడం మేం సాధించే గొప్ప విజయం. అందుకే అక్కడి నుంచి మా సైన్యాన్ని ఉపసంహరించుకునేది లేదు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడికి తలొగ్గబోం’’ అని కట్జ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇరాన్‌కు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు.
లెబనాన్ విషయంలో తాము తీసుకునే చర్యలకు ఇరాన్ అడ్డుపడ్డా, తమ దేశంపై మళ్లీ దాడికి దిగినా మరోసారి పూర్తిసత్తాతో ప్రతిదాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. తమ దేశంతోపాటు ప్రజల రక్షణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. లెబనాన్ విషయంలో తమ చర్యలకు ఇరాన్ అడ్డుపడొద్దన్నారు. మరోవైపు ఇరాన్‌తో శాంతి ఒప్పందం అంటే లెబనాన్‌పై కూడా దాడులు చేయకూడదని ఇరాన్ కోరింది. దీనికి అమెరికా కూడా అంగీకరించింది. కానీ, ఈ విషయంలో తమ దేశం కట్టుబడి ఉండబోదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.