వాషింగ్టన్ : భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా ప్రభుత్వం అదనంగా 10 శాతం సుంకాన్ని విధించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ కొత్త సుంకాలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అమెరికన్ వ్యాపారాలకు నష్టం కలిగించేలా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే దేశాలపై వాణిజ్య చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించే ‘యూఎస్ ట్రేడ్ యాక్ట్ 1974’లోని సెక్షన్ 301కింద జరిపిన దర్యాప్తు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(యూఎస్టీఆర్) కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అమెరికా భారతదేశానికి అతిపెద్ద ఎగుమతి మార్కెట్. ఈ అదనపు 10 శాతం సుంకం కారణంగా ఎగుమతి రంగాలపై తీవ్రప్రభావం పడే అవకాశం ఉంది. టెక్స్టైల్స్, గార్మెంట్స్, రత్నాలు, ఆభరణాలు, లెదర్ ఉత్పత్తులు, వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు, ఇంజినీరింగ్ వస్తువులు, రసాయనాలు, కొన్ని తయారీ రంగాలు దీనివల్ల దెబ్బతినే అవకాశం ఉంది.