హనుమకొండ, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేండ్లు గడిచినా ఇక్కడి అధికారులు, సిబ్బందిపై ఆంధ్రా అధికారుల పెత్తనం కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలోనూ ఉమ్మడి రాష్ట్రంలోని తరహాలోనే పాలన నడుస్తున్నది. ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(ట్రాన్స్‌కో)లో కీలకమైన పోస్టుల్లో ఆంధ్రా అధికారులే ఉంటూ ట్రాన్స్ఫర్ చేసినా వెళ్లకుండా ఇక్కడి సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు. ఈనెల 15న ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(ట్రాన్స్‌కో) పలువురు ఇంజనీర్లకు బదిలీలు అయ్యాయి.
వరంగల్ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయిన చీఫ్ ఇంజినీరు శ్రీరామకుమార్ సీఎండీ ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ్రప్రభు త్వ సర్వీసు నిబంధనల ప్రకారం ఉన్నతాధికారులు పనిచేసే ప్రదేశంలోనే నివాసం ఉండాలి. ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో అయినా ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే ఇతర ప్రాంతాలకు వెళ్లాలి. కానీ ట్రాన్స్‌కో సీఈ శ్రీరామకుమార్ ప్రతి శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లి మళ్లీ సోమవారం సాయంత్రం లేదా మంగళవారం వరంగల్‌కు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదులు అందడంతో ఆయనను హైదరాబాద్‌కు బదిలీ చేసి, అక్కడ ట్రైనింగ్ విభాగంలో ఉన్న మురళీసాగర్ను వరంగల్ జోన్ చీఫ్ ఇంజినీరుగా పోస్టింగ్ ఇస్తూ సీఎండీ డీ కృష్ణభాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. పది రోజులైనా శ్రీరామకుమార్ రిలీవ్ కాక ఇక్కడి పోస్టులోనే కొనసాగుతున్నారు.
ఇక్కడికి బదిలీ అయిన మురళీసాగర్ సైతం సీఎండీ ఆదేశాలను లెక్కచేయకుండా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. శ్రీరామకుమార్ వ్యవహార శైలిపై విమర్శలు, ఆరోపణలతో ఏడాది క్రితం ట్రాన్స్‌కో యాజమాన్యం ఆయనను హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో హెచ్ఆర్ విభాగం సీజీఎంగా నియమించింది. బదిలీ ఉత్తర్వులను పట్టించుకోకుండా పోస్టింగ్‌లో చేరలేదు. ఆ తర్వాత పైరవీతో రద్దు చేసుకున్నారు. తాజాగా పాత పద్ధతిలోనే ఇక్కడే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రా అధికారి వేధింపులను సహించేది లేదని, వెంటనే బదిలీ చేయాలని, లేకుంటే సామూహిక నిరసనలు చేపడుతామని కార్మికులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రె డ్డి, ఇంధన శాఖ నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కార్యక్రమాలను సైతం పట్టించుకోకుండా ఉంటున్న సీఈని బదిలీ చేసేందుకు యాజమాన్యం అష్టకష్టాలు పడుతున్నది. ట్రాన్స్‌కో వరంగల్ జోన్లో పాత వరంగల్, ఖమ్మం జిల్లాలు ఉంటాయి. దేశంలోనే అది పెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరలో కీలకమైన కరెంటు సరఫరా ఏర్పాట్ల విషయంలోనూ ఆంధ్రా అధికారి పట్టించుకోలేదని కార్మికులు పేర్కొంటున్నారు. 2026 మేడారం జాతర ఏర్పాట్ల సమీక్ష కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఏడాది జనవరి 17న అక్కడ బస చేసి మరుసటి రోజు అధికారులతో నిర్వహించిన సమీక్షకు అ తడు హాజరు కాలేదని సిబ్బంది చెప్తున్నారు. మార్చి 27న భద్రాచలంలోని ఆలయానికి సీఎం వచ్చినా, ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని, నిబంధనల ప్రకారం పనిచేసే తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. తెలంగాణలోని జాతరలు, పండుగల ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బదిలీ ఆర్డర్స్ వచ్చిన మాట వాస్తవమే. రిలీవర్ ఇంకా రాలేదు. నా అంతట నేను వరంగల్‌ను విడిచి పెట్టి వెళ్లలేను కదా. రిలీవర్ వస్తే వెళ్తాను.
ట్రాన్స్‌కో వరంగల్ చీఫ్ ఇంజినీరు జీ శ్రీరామకుమార్ తీరు వివాదాస్పదంగా ఉంటున్నది. ఉద్యోగులు, కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు రావొద్దని.. ఆ విభా గంలోని వారికి చెప్పుకోవాలని ఆంధ్రా అధికారి శ్రీరామకుమార్ గతంలో వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. నేరుగా తన వద్దకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని, తన అనుమతి లేకుండా చీఫ్ ఇంజనీరు కార్యాలయానికి రావొద్దని హెచ్చరించారు.
ఆంధ్రా అధికారి వేధింపులకు నిరసనగా ఇంజినీర్లు, ఆర్టిజన్లు, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ ఉద్యోగులు గత నెలలోనూ సీఈ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కార్యాలయం ఆవరణలోని వాహనాల పార్కింగ్ విషయంలోనూ వివక్ష చూపిస్తున్నారు. ఇక్కడి కార్మికుల వాహనాలు గేట్ బయట పెట్టాలని, ఆంధ్రా అధికారుల వాహనాలను లోపలికి అనుమతించాలని సెక్యూరిటీకి ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే, ఇక్కడిని వారిని ఇబ్బంది పెడుతున్న ఆ అధికారి విషయంలో ట్రాన్స్‌కో యాజమాన్యం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు, సిబ్బంది కోరుతున్నారు.