టెల్అవీవ్, వాషింగ్టన్, అక్టోబర్ 25: హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో మరో సరికొత్త అస్ర్తాన్ని ఇజ్రాయెల్ రంగంలోకి దించింది. ఐరన్‌డోమ్, ఐరన్బీమ్ తర్వాత ఇప్పుడు ఐరన్‌స్టింగ్ వ్యవస్థను బయటకు తీసింది. గాజా స్ట్రిప్‌లో జనావాసాల మధ్య నుంచి రాకెట్లను ప్రయోగించే లాంఛర్లను ధ్వంసం చేయడానికి పది రోజుల కిందటి నుంచే దీన్ని ప్రయోగిస్తున్నది. ఐరన్ స్టింగ్ అనేది అధునాతన మోర్టార్ బాంబ్. అత్యం త కచ్చితత్వంతో ఇది లక్ష్యాలను ఛేదించగలదు. దీనిలో గైడెడ్ వ్యవస్థ ఉన్నది. 12 కిలోమీటర్ల పరిధి వరకు దీన్ని ప్రయోగించవచ్చు. అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాల్లోనూ కచ్చితత్వంతో లక్షిత దాడులు నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
గాజాపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సరైన సమయం కోసం వేచిచూస్తున్నట్టు పేర్కొన్నది. మంగళవారం గాజాపై 400 వైమానిక దాడులు చేశామని ప్రకటించింది. ఈ దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా వైద్య శాఖాధికారులు వెల్లడించారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ఒక్కసారిగా జరిగింది కాదని, 56 ఏండ్లుగా పాలస్తీనీయులు అణచివేతకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల ఏర్పాటే సమస్యకు పరిష్కారమని పేర్కొన్నారు. గుటెరస్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని గుటెరస్ వివరణ ఇచ్చారు.