గాజా, అక్టోబర్ 13: కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్‌కు చెందిన మిగిలిన 20 మంది బందీలను హమాస్ సోమవారం విడుదల చేసింది. దీంతో వేలాదిమంది పాలస్తీనా పౌరులను హతమార్చి గాజా స్ట్రిప్‌ని మరుభూమిగా మార్చిన రెండేళ్ల యుద్ధానికి తెరపడినట్లయింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందం అమలులోకి వచ్చిన సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ చేరుకున్న రోజే బందీలు అందరినీ హమాస్ విడుదల చేయడం విశేషం.
యుద్ధం ముగిసిపోయిందని, పశ్చిమాసియాలో సుస్థిర శాంతి స్థాపనకు తలుపులు తెరుచుకున్నాయని ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. ఒప్పందంలో భాగంగా 1,900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్ కరువు కాటకాలతో అల్లాడుతున్న గాజాకు ఆహారం, మందుల సరఫరాలను అనుమతించనున్నది. ట్రంప్ తన ఈజిప్టు పర్యటనలో తాను ప్రతిపాదించిన శాంతి ఒప్పందం గురించి, యుద్ధానంతర ప్రణాళికల గురించి ఇతర నాయకులతో చర్చించనున్నారు.
గడచిన 24 గంటల్లో కూలిపోయిన శిథిలాల కింద నుంచి 60 మృతదేహాలను వెలికితీసినట్లు గాజా ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చి గాజాలోని కొన్ని భాగాల నుంచి ఇజ్రాయెలీ సైనిక బలగాలు తప్పుకున్న తర్వాత గడచిన నాలుగు రోజుల్లో 200 మృతదేహాలను శిథిలాల నంచి వెలికితీశారు. అనేక ప్రాంతాలలో కూలిపోయిన భవన శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాల వెలికితీత ఇప్పటివరకు జరగలేదు. దీంతో అనేక మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఇజ్రాయెల్ దాడుల్లో 67,800 మందికిపైగా పాలస్తీనా పౌరులు మరణించారు. అయితే మృతులలో పౌరులు ఎందరు, హమాస్ సభ్యులు ఎందరు అన్న లెక్కలను ఆరోగ్య శాఖ చెప్పనప్పటికీ వీరిలో సగం మంది మహిళలు, పిల్లలేనని మాత్రం ఇదివరకే ప్రకటించింది. తీవ్ర వేదనను అనుభవించిన గాజాలోని ఇజ్రాయెలీ బందీలు విడుదలై తమ కుటుంబ సభ్యులను ఎట్టకేలకు చేరుకోనుండడంపై ఐక్యరాజ్యసమితి(యూఎన్) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సంతృప్తి వ్యక్తం చేశారు. గుండెల మీద నుంచి పెద్ద భారం తొలగినట్లు ఉందని వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్‌లో బందీలుగా ఉన్న 1,900 మందికిపైగా పాలస్తీనా ఖైదీలు సోమవారం వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ చేరుకున్నారు. పాలస్తీనా ఖైదీలు ఉన్న బస్సులు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లాను చేరుకున్నాయి. ఒక బస్సు మాత్రం గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించినట్లు హమాస్ నిర్వహించే ఖైదీల కార్యాలయం తెలిపింది. కాగా, గాజాలో యుద్ధం ముగిసిందన్న ట్రంప్ వ్యాఖ్యలను హమాస్ అధికార ప్రతినిధి స్వాగతించారు. ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించకుండా మధ్యవర్తులు, అంతర్జాతీయ సమాజం చూడాలని హమాస్ ప్రతినిధి హజెమ్ కసెమ్ టెలిగ్రాం ద్వారా విజ్ఞప్తి చేశారు.