ఇస్లామాబాద్, నవంబర్ 24: పాకిస్థాన్ ప్రభుత్వం దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆదివారం భారీగా భద్రతా దళాలను మోహరించింది. రోడ్లను మూసివేసి, మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలంటూ ఆయన మద్దతుదారులు ఆదివారం ఇస్లామాబాద్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. బానిసత్వ సంకెళ్లను తెంచేందుకు చేస్తున్న ఈ నిరసన కవాతులో ప్రజలు పాల్గొనాలని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ పిలుపునిచ్చింది.
ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఖైబర్ పఖ్తుంఖా ముఖ్యమంత్రి అలీ అమీన్ ఈ కవాతుకు నేతృత్వం వహించనున్నారు. పాక్‌లోనూ బంగ్లాదేశ్‌లా సామూహిక నిరసన ప్రదర్శన జరిగే అవకాశం ఉన్నదని అమీన్ హెచ్చరించారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు తమ పార్టీ ఇతర నాయకులను జైళ్ల నుంచి విడుదల చేయాలని, ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ నుంచి దొంగిలించిన మెజారిటీని పునరుద్ధరించాలని, ఉన్నత స్థాయి జడ్జీల నియామకంలో చట్టసభల సభ్యులకు గల అధికారులను పునరుద్ధరించాలని పీటీఐ డిమాండ్ చేస్తున్నది.