వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే కమలా హ్యారిస్ ఏ జాతికి చెందినదన్న అంశంపై ట్రంప్(Donald Trump) కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె నల్లజాతీయురాలా లేక ఆమె తన జాతి వర్ణాన్ని రాజకీయాలకు వాడుకుంటోందా అని ట్రంప్ ప్రశ్నించారు. చికాగోలో జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్టు కాన్ఫరెన్స్‌లో మాజీ అధ్యక్షుడు మాట్లాడారు. కమలా హ్యారిస్‌కు భారతీయ మూలాలు ఉన్నాయని, ఆమె భారతీయ సంస్కృతిని ప్రమోట్ చేస్తోందని, కానీ కొన్నాళ్ల క్రితమే ఆమె నలుపు వర్ణానికి చెందిన మహిళ అని తెలిసిందని ట్రంప్ పేర్కొన్నారు.
ఎన్నికల వేళ నల్లజాతీయురాలన్న గుర్తింపును ఆమె కోరుకుంటోందని, అందుకే ఆమె భారతీయ మూలాలు ఉన్న వ్యక్తా లేక నల్లజాతీయురాలా అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా చరిత్రలో ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నలుపువర్ణ, దక్షిణాసియా మూలాలు ఉన్న వ్యక్తిగా కమలా హ్యారిస్ రికార్డులో నిలిచారు.
భారతీయ మూలాలు ఉన్నా.. లేక నల్ల జాతీయురాలైనా.. తాను రెండింటినీ గౌరవించనున్నట్లు ట్రంప్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల రేసు ఆసక్తికరంగా మారడంతో.. ట్రంప్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కమలా హ్యారిస్ తల్లి భారతీయురాలు. తండ్రి జమైకా నల్లజాతీయుడు.
కమలా హ్యారిస్ మూలాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వైట్‌హౌజ్ ఖండించింది. ఆ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నట్లు పేర్కొన్నది.