టెహ్రాన్ : హొర్ముజ్ జలసంధిని గురువారం నుంచి మూసివేసినట్టు ఇరాన్ మిలిటరీ ప్రకటించింది. ట్యాంకర్లు, వాణిజ్య నౌకల రాకపోకలు నిలిపివేశామని, తమ ఆదేశాలను ధిక్కరించి ఏ నౌకైనా జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే దానిపై కాల్పులు తప్పవని హెచ్చరించింది. అయితే హొర్ముజ్‌లో నౌకల రాకపోకలు సాగుతున్నాయని యూఎస్ మిలిటరీ ఎక్స్‌లో వెల్లడించింది. హొర్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ దక్షిణ ప్రాంతంలో అమెరికా తాజాగా దాడులకు పాల్పడినట్టు ఇరాన్ ప్రకటించింది. పోర్ట్ సిటీ బందర్ అబ్బాస్‌తో పాటు ఖేష్మ్ ద్వీపం, సిరిక్ నగరాల్లో పేలుళ్లు సంభవించినట్టు తెలిపింది.
ఇరాన్ కండ్లుగప్పి హొర్ముజ్ జలసంధి మీదుగా రహస్యంగా మిలియన్ బ్యారెళ్ల చమురును అమెరికా అత్యంత సులభంగా తరలించిందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ బుధవారం వెల్లడించారు. ఇది ఒక కోవర్ట్ ఆపరేషన్ అని, దాని గురించి టెహ్రాన్‌కు ఇప్పుడే తెలిసిందని అన్నారు. ఓవల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హొర్ముజ్ లో వాణిజ్య నౌకలను లైట్లు లేకుండా మార్గదర్శనం చేస్తూ భారీ పరిమాణంలో చమురును అమెరికా తరలించిందని చెప్పారు. ‘మిలియన్ బ్యారెళ్ల చమురును అక్కడి నుంచి తరలించిన విషయం మీకు తెలుసా? మీకే కాదు ఎవరికీ తెలియదు. ఇరాన్‌కు కూడా ఇప్పటి వరకు తెలియదు’ అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.