టెహ్రాన్: ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్‌కు ఇప్పుడు సైబర్ దాడుల భయం కూడా పట్టుకుంది. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన పలు ఆర్థిక సంస్థలు, సెపా బ్యాంక్ మంగళవారం సైబర్ దాడులకు గురయ్యాయి. వాటి సర్వర్లు, ఆన్లైన్ నెట్‌వర్క్‌లు కొన్ని గంటలు పనిచేయలేదని ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. దీంతో వాటి కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావం కొన్ని పెట్రోల్ బంక్‌ల కార్యకలాపాలపై కూడా పడింది. కొన్ని గంటల పాటు కష్టపడిన తర్వాత టెక్ నిపుణులు వాటిని పునరుద్ధరించారు. దీంతో ఇజ్రాయెల్ నుంచి భౌతిక దాడులే కాదు సైబర్ దాడులు కూడా తీవ్రంగానే జరగవచ్చునని టెహ్రాన్ భయపడుతున్నది.
ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, వారి బాడీగార్డులు, భద్రతా బలగాలు పబ్లిక్ నెట్‌వర్క్‌తో పనిచేసే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లతో సహా అన్ని రకాల కమ్యూనికేషన్ పరికరాల వినియోగంపై నిషేధాన్ని విధించింది. వారు వాడుతున్న ఫోన్లను వెంటనే అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధానికి కారణం వెల్లడించనప్పటికీ తాము వాడుతున్న ఫోన్ల ద్వారా తమ కదలికను ఇజ్రాయెల్ దళాలు ఎప్పటికప్పుడు కనిపెడుతున్నాయని ఇరాన్ అనుమానిస్తున్నది. ఈ ఫోన్ల ట్రాకింగ్ ద్వారానే ఇజ్రాయెల్ ఉన్నత స్థాయి వ్యక్తులను హతమార్చిందని, గతంలో కూడా హమాస్ నేత ఇస్మాయిల్ హనియేను కూడా ఇదే విధంగా హత్య చేసిందని ఇరాన్ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో వాటిని వినియోగించవద్దని ఆదేశాలు ఇచ్చింది.
యుద్ధం కారణంగా ఇరాన్లో పౌరుల పరిస్థితి దిగజారుతున్నది. టెహ్రాన్‌లో ఆహారానికి కొరత ఏర్పడిందని, దుకాణాలు తెరవకపోవడంతో బ్రెడ్ కూడా లభించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క టెహ్రాన్‌ను ఖాళీ చేయాలంటూ ట్రంప్ ఆదేశించగా, ఇంటి నుంచి బయటకు రావడానికి కానీ, నగరం వదిలి వెళ్లడానికి కానీ పోలీసులు అంగీకరించడం లేదని వారు చెప్పారు. టెహ్రాన్ జైలులో శిక్ష అనుభవిస్తూ సెలవులో ఉన్న నోబల్ శాంతి బహుమతి గ్రహీత నర్గేస్ నగరం విడిచివెళ్లిపోయినట్టు ఎక్స్‌లో తెలిపారు.