Iran vs US : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ (Iran) ను అమెరికా హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి పూర్తిగా తెరిచి ఉంటుందని, వాణిజ్య నౌకలపై ఎలాంటి దాడులు జరగవని పేర్కొంటూ 24 గంటల్లోగా ఇరాన్ బహిరంగ ప్రకటన చేయాలని వాషింగ్టన్ స్పష్టం చేసినట్టు సమాచారం. గడువులోగా చెప్పినట్లు చేయకుంటే తీవ్రమైన సైనిక, ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరించినట్టు తెలుస్తోంది.
ఈ హెచ్చరికను మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌కు అమెరికా చేరవేసినట్టు సమాచారం. ‘నౌకలపై కాల్పులు ఆపేస్తామని బహిరంగంగా చెప్పాలి. అలాగే తాము తప్పు చేశామని వాళ్లు కనీసం పరోక్షంగానైనా అంగీకరించాలని మేము కోరుకుంటున్నాం. కాల్పులు ఆపేస్తామనేదే రేపు వారి ప్రకటన కావాలని, లేకపోతే వారికి అది మంచి రోజు కాబోదని అమెరికా అధికారి హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒమాన్‌లో మధ్యవర్తిత్వ చర్చల్లో పాల్గొననున్నారు.
ఈ సమావేశం అనంతరం ఇరాన్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అయితే గడువులోగా స్పష్టమైన హామీ రాకపోతే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.