Strait of Hormuz : ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. తుది ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా పలు అంశాలపై వరుసగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధి విషయంలో ఇరు దేశాలు కీలక అంగీకారానికి వచ్చాయి. జలసంధి వద్ద ఎలాంటి సైనిక పరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి.
ఇటీవల స్విట్జర్లాండ్‌లో జరిగిన సాంకేతిక స్థాయి ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జలసంధి వద్ద ఇరాన్‌తోపాటు అమెరికా బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. దీంతో రెండు దేశాల భద్రతా బలగాల మధ్య ఎలాంటి అనూహ్య, అవాంఛిత పరిణామాలు, అపార్థాలు తలెత్తకుండా, ఉద్రిక్తతలు చెలరేగకుండా ఉండేందుకు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉపయోగపడుతుందని అమెరికా, ఇరాన్ భావిస్తున్నాయి. ముఖ్యంగా సైనిక పరమైన చర్యలకు తావులేకుండా ఉండాలని ఇరు దేశాలు అనుకుంటున్నాయి. ఇదే సమయంలో హార్ముజ్ వద్ద గతంలోలాగా పూర్తి్స్థాయి పట్టుకోసం ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఈ మార్గంలో వెళ్లే వాణిజ్య నౌకలు తమ నియమాల్ని పాటించాల్సిందే అని చెబుతోంది.
ఇరాన్ సూచించిన మార్గాల్లోనే నౌకలు వెళ్లాలని, ఈ విషయంలో నౌకలు తమ ఆదేశాల్ని అనుసరించాలని సూచించింది. హార్ముజ్ మార్గంలో తమ సైనిక చర్యల్ని తగ్గిస్తామని అమెరికా కూడా ఇటీవలే ప్రకటించింది. ఇరాన్, అమెరికా మధ్య ఇటీవల స్విట్జర్లాండ్ వేదికగా 14 అంశాల ప్రాతిపదికగా శాంతి ఒప్పందం కుదిరింది. 60 రోజులపాటు శాంతి ఒప్పంద ప్రణాళిక అమలు చేస్తారు. అనంతరం ఈ అంశంలో మార్పులు, చేర్పుల ఆధారంగా ఇరు దేశాలు తుది ఒప్పందానికి వస్తాయి.