టెహ్రాన్: గల్ఫ్ దేశాలు, అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ‘హొర్ముజ్ జలసంధి’ని ఇరాన్ ఒక ఆయుధంగా వాడుకుంటున్నది. హొర్ముజ్లో వందలాది నౌకల రాకపోకలను అడ్డుకున్న ఇరాన్, ఇప్పుడు కొత్తగా ట్రాన్సిట్ ఫీ అంటూ నౌకలపై భారీ ఎత్తున లెవీ విధించనుందని వార్తలు వెలువడ్డాయి. హొర్ముజ్ జలసంధి నుంచి వెళ్లే నౌకలపై ఇరాన్ 2 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.18 కోట్లు) లెవీ వసూలు చేయనున్నట్టు తెలిసింది.
కొన్ని ట్యాంకర్ల నుంచి ఇప్పటికే లెవీని వసూలు చేసినట్టు ఇరాన్ చట్టసభ సభ్యుడు అలావుద్దీన్ బోరోజెర్డీ చెప్పారు. 48 గంటల్లో హొర్ముజ్ జలసంధిని తెరువాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన వేళ.. నౌకలపై ఇరాన్ లెవీ విధించేందుకు సిద్ధం కావటం గమనార్హం. ముడి చమురు, గ్యాస్ ట్యాంకర్లే కాకుండా, గల్ఫ్ దేశాల ఆహార దిగుమతులకు హొర్ముజ్ జలసంధి కీలకం. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్ దేశాల ఆహార దిగుమతులన్నీ ఇక్కడ్నుంచీ జరుగుతాయి. వీటిపైనా ‘ట్రాన్సిట్ ఫీజు’ను ఇరాన్ వసూలు చేస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.