Abolfazl Shekarchi : తమ శతృదేశాలతోపాటు, అమెరికా, ఇజ్రాయెల్‌కు సహకరించే దేశాల్లోని పర్యాటక కేంద్రాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఆయా దేశాల్లోని రిక్రియేషనల్ పార్కులు, ఇతర టూరిస్ట్ డెస్టినేషన్స్ లక్ష్యంగా చేసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ సైనిక అధికారి జనలర్ అబోల్ఫాజి షెకార్చి హెచ్చరించారు. అంటే, ఇకపై వైమానిక దాడులే కాకుండా తీవ్రవాద దాడులకు కూడా పాల్పడుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఇరాన్‌లోని నంటాజ్ అణుకేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్-అమెరికా సైన్యం దాడులకు పాల్పడింది.
నంటాజ్ అణుకేంద్రంపై శనివారం ఉదయం మిస్సైళ్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే, ఈ దాడుల్లో అణుకేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. ఎలాంటి లీకేజీ, రేడియేషన్ లేదని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్‌కు నంటాజ్ అణుకేంద్రం చాలా కీలకం. ఈ అణుకేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇది రెండోసారి. యుద్ధం ప్రారంభమైన తొలి వారంలోనే ఈ కేంద్రంపై దాడి జరిగింది. అప్పుడు సమీపంలోని కొన్ని బిల్డింగులు ధ్వంసమయ్యాయి. అయితే, అప్పుడు కూడా ఎలాంటి రేడియోధార్మికత విడుదల కావడం లేదని ఇరాన్ సహా ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ అణుకేంద్రం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గత ఏడాది జూన్‌లో జరిగిన వైమానిక దాడుల సందర్భంగా కూడా ఇజ్రాయెల్ ఈ కేంద్రంపై దాడికి పాల్పడింది.
ఇరాన్‌పై దాడిని త్వరలోనే ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగడం విశేషం. ఇరాన్ యుద్ధం ప్రారంభమై నాలుగు వారాలకు చేరింది. ఇరాన్‌పై దాడి చేసేందుకు ట్రంప్ దాదాపు 3,000 మంది మెరైన్ సైనికుల్ని మోహరిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇరాన్.. గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది.