వాషింగ్టన్, జూన్ 12: ఇరాన్ చమురు పరిశ్రమను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించిన కొన్ని గంటలకే ఆ దేశంపై సైనిక దాడులను విరమించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించే ఒప్పందం దాదాపు పూర్తయిందని, ఈ వారాంతంలో యూరప్‌లో దీనిపై సంతకాలు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం ఓవల్ ఆఫీసులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఈ వారాంతంలోనే యూరప్‌లో జరిగే సంతకాల కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. తాజా విడత చర్చల గురించి ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్తోసహా పశ్చిమాసియా దేశాల నాయకులతో తాను మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు.
అనంతరం, గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న జార్జియా లెఫ్టినెంట్ గవర్నర్ బర్ట్ జోన్స్‌కు మద్దతుగా నిర్వహించిన టెలీ-ర్యాలీలో ట్రంప్ ప్రసంగిస్తూ ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా ముగించిందని ప్రకటించారు. మీరు విన్నారో లేదో తెలియదు కానీ మేము ఈ రోజు(గురువారం) ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాము. తాము ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదన్న మా షరతుకు ఇరాన్ ఒప్పుకుంది. అసలు ఉద్దేశం అదే అని ట్రంప్ అన్నారు.
అంతకు ముందు ఓవల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ స్టాక్ మార్కెట్‌కు ఒప్పందం నచ్చిందని, ఒప్పందంపై సంతకాలు శీఘ్రంగా జరిగిపోతాయని చెప్పారు. ఒప్పందం ఖరారైన వెంటనే హొర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని ఆయన అన్నారు. అణ్వాయుధాన్ని పొందేందుకు చేసే ప్రయత్నాన్ని విరమించుకోవడానికి ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చెప్పారు. అణ్వాయుధాన్ని ఇరాన్ కొనుగోలు చేయదు. లేదా ఏ విధంగానూ దానిని అభివృద్ధి చేయదు. వారి వద్ద అణ్వాయుధం ఉండదు అని ఆయన ప్రకటించారు.
గురువారం ఉదయం ఇరాన్‌పై తీవ్రమైన దాడి చేస్తామని, ఆ దేశ చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే శాంతి చర్చల్లో పురోగతి సాధించామంటూ హఠాత్తుగా ఇరాన్‌పై దాడులను రద్దు చేసినట్లు ట్రంప్ ప్రకటించారు.