టెహ్రాన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రతిపాదనలను ఇరాన్ గురువారం తిరస్కరించింది. చర్చలు ప్రారంభం కావడానికి ముందే అందులోని మూడు ముఖ్యమైన నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఇరాన్ తెలిపింది. లెబనాన్‌లో కాని, ప్రతిఘటనా కూటమి అంతటా కాని జరిగే ఏ ఉల్లంఘన అయినా స్పష్టమైన పరిణామాలను, బలమైన ప్రతిస్పందనలను ఎదుర్కొంటుందని ఇరాన్ హెచ్చరించింది. కాల్పుల విరమణను అసంబద్ధంగా అభివర్ణించిన ఇరాన్.. అమెరికా పట్ల ఇరాన్‌కు తీవ్రమైన చారిత్రక అపనమ్మకం ఉందని పేర్కొంటూ గతంలో ఇచ్చిన అన్ని రకాల హామీలను పదేపదే ఉల్లంఘించిన విషయాన్ని ఉటంకించింది. అమెరికా అధ్యక్షుడు తన ట్రూత్ సోషల్‌లో ఇరాన్‌కు చెందిన 10 అంశాల ప్రతిపాదన కార్యరూపం దాల్చగలదని, దీనిపై సంప్రదింపులు జరుగుతాయని పేర్కొన్నారని ఇరాన్ గుర్తుచేసింది. ఏదేమైనా ఈ ప్రతిపాదనలోని 3 నిబంధనల ఉల్లంఘన ఇప్పటి వరకు జరిగిందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎంబీ ఘలీబఫ్ షేర్ చేసిన ప్రకటన పేర్కొన్నది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వెంటనే ఘర్షణలను నిలిపివేయాలని, ఈ మంటలను ఆలస్యం చేయకుండా ఆర్పివేయాలని పిలుపునిచ్చారు.
ఇరాన్ ఇచ్చిన 10 అంశాల ప్రతిపాదనలో మొదటిది లెబనాన్‌లో కాల్పుల విరమణకు సంబంధించింది. ఈ హామీని పాక్ ప్రధాని షరీఫ్ బహిరంగంగా ప్రస్తావించారు. లెబనాన్, ఇతర ప్రాంతాలతో సహా అన్ని చోట్లా కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ మొదటి నిబంధనే ఉల్లంఘన జరిగింది. రెండవ ఉల్లంఘన ఇరాన్ గగనతలంలోకి డ్రోన్ చొరబడడం. ఫరా ప్రావిన్సులోని లార్ నగరంలో చొరబడిన ఈ డ్రోన్‌ను ధ్వంసం చేయడం జరిగింది. ఇది ఇరాన్ గగనతలాన్ని ఇకముందు ఉల్లంఘించరన్న నిబంధనను అతిక్రమించడమే. మూడవది యురేనియంను శుద్ధి చేసుకునే హక్కును ఇరాన్‌కు దూరం చేయడం. ఈ హక్కు గురించి 10 అంశాల ప్రతిపాదనలో ఆరవ నిబంధనగా పొందుపరచడం జరిగింది. చర్చలు జరగడానికి ప్రాతిపదికగా కార్యరూపం దాల్చగలవని అమెరికా అధ్యక్షుడే పేర్కొన్న నిబంధనలు చర్చలు ప్రారంభం కావడానికి ముందే బహిరంగంగా, స్పష్టంగా ఉల్లంఘన జరిగాయని ఇరాన్ తన ప్రకటనలో పేర్కొన్నది.