Iran | ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు తగ్గిన వేళ ఇరాన్ తూర్పు ప్రాంతంలో ఎయిర్ స్పేస్‌ను తిరిగి తెరిచింది. ఇజ్రాయెల్‌తో 12 రోజుల ఉద్రిక్తల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎయిర్‌స్పేస్‌ను తిరిగి తెరవాలని నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 13న ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించడంతో ఇరాన్ తన ఎయిర్ స్పేస్‌ను మూసివేయడంతో పాటు ఇజ్రాయెల్‌పై సైతం మిస్సైల్ దాడులు మొదలుపెట్టింది. అమెరికా జోక్యంతో రెండుదేశాల మధ్య మంగళవారం నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది.
ఇరాన్ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్ఏ ప్రకారం.. రవాణా మంత్రిత్వశాఖ ప్రతినిధి మాజిద్ అఖావన్ తూర్పు ప్రాంతంలో అంతర్జాతీయ, దేశీయ విమానాల కోసం ఎయిర్ స్పేస్‌ను తిరిగి తెరిచినట్లు తెలిపారు. కానీ, తూర్పు ఇరాన్‌లోని విమానాశ్రయాల నుంచి బయలుదేరే.. చేరుకునే విమానాలకు మాత్రమే ఈ ఎయిర్ స్పేస్‌ను తిరిచినట్లు చెప్పారు. యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్న మషద్ విమానాశ్రయంలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చాబహార్, జహెదాన్, జాస్క్ విమానాశ్రయాలను కూడా తిరిగి తెరిచామని.. అయితే, తదుపరి నోటీసులు వచ్చే వరకు టెహ్రాన్, ఇరాన్‌లోని మిగిలిన ప్రాంతాలకు విమానాలను ఇప్పటికీ అనుమతించలేదని చెప్పారు.