న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: అమెరికా, ఇజ్రాయెల్ వారాల తరబడి దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ సైనిక సామర్థ్యాల్లో గణనీయమైన భాగం చెక్కుచెదరకుండా ఉందని ఇటీవలి అమెరికా నిఘా అంచనాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ వార్తాకథనం పేర్కొన్నది. ఇరాన్ క్షిపణి లాంచర్లలో దాదాపు సగం ఇప్పటికీ పనిచేస్తున్నాయి లేదా తిరిగి పొందగలిగే పరిస్థితిలో ఉన్నాయి. ఇరాన్ ఆయుధాగారంలో దాదాపు 50 శాతం వేలాది ఏకదిశ దాడి డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. దాడుల తర్వాత కొన్ని క్షిపణి లాంచర్లు భూమిలో కూరుకుపోయి ఉండవచ్చు లేదా తాత్కాలికంగా అందుబాటులో లేకుండా పోయి ఉండవచ్చు. కాని అవి ధ్వంసం కాలేదు అని సీఎన్ఎన్ తెలిపింది. ఇరాన్ ఇప్పటికీ మొత్తం ప్రాంతాన్ని అల్లకల్లోలం చేయగలిగే స్థితిలోనే ఉందని వర్గాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ పేర్కొన్నది.
ఈ వారంలో ఇరాన్ లోపలి 12,300కు పైగా లక్ష్యాలపై అమెరికా సెంట్రల్ కమాండ్ దాడి చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తగ్గించి, సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ, జాతీయ భద్రతా కమాండర్ అలీ లారీజానీతోసహా సీనియర్ నాయకులను అంతం చేసింది. అయినప్పటికీ ఇరాన్ వద్ద భారీ సంఖ్యలో క్షిపణులు సహా గణనీయమైన స్థాయిలో ఆయుధాలు ఉన్నట్లు అమెరికా నిఘా అధికారులు అంచనా వేశారు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనకు భిన్నంగా ఉంది. ఇరాన్లో క్షిపణులు, డ్రోన్లను దాదాపు నిర్మూలించామని, చాలా తక్కువ సంఖ్యలో క్షిపణి లాంచర్లు మిగిలి ఉన్నాయని ట్రంప్ పలుసార్లు తెలిపారు.
ఇరాన్‌లోని విస్తృతమైన సొరంగ వ్యవస్థలు, సంచార ప్రయోగ వేదికలు దాడుల ప్రభావాన్ని పరిమితం చేశాయని సీఎన్ఎన్ పేర్కొన్నది. దాడుల తర్వాత ప్రయోగ వాహనాలను వేగంగా తరలించవచ్చని, దీనివల్ల వాటిని గుర్తించడం, ధ్వంసం చేయడం కష్టమవుతుందని వార్తా కథనం తెలిపింది. హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకా రవాణాకు ముప్పు కలిగించడంలో కీలక పాత్ర పోషించే తీర రక్షణ క్రూయిజ్ క్షిపణులు కూడా చాలా వరకు చెక్కుచెదరలేదని కూడా అధికారులు భావిస్తున్నారు.
అయితే నిఘా అధికారుల అంచనా నివేదికను అమెరికా అధికారులు ఖండించారు. ఇరాన్ సైన్యం నాశనమైందని, బాలిస్టిక్ క్షిపణి, డ్రోన్ దాడులు 90 శాతం తగ్గాయని వైట్ హౌస్ అధికార ప్రతినిధి సీఎన్ఎన్కు తెలిపారు. రక్షణ శాఖ కార్యాలయం(పెంటగాన్) ప్రతినిధి షాన్ పార్నెల్ ఈ నివేదికను పూర్తిగా తప్పు అని పేర్కొంటూ ఇరాన్ సామర్థ్యాలను నాశనం చేయడంలో అమెరికా దళాలు నిర్ణీత సమయం కంటే చాలా ముందున్నాయి అని చెప్పారు. ఇరాన్ దాడులు గణనీయంగా తగ్గాయని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా అన్నారు.