Iran | న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: యుద్ధం ముగింపునకు అమెరికాకు ఇరాన్ ఒక కొత్త ప్రతిపాదన అందచేసింది. తమ దేశంపై అమెరికా దిగ్బంధాన్ని ఎత్తేసి, యుద్ధానికి ముగింపు పలికితే హొర్ముజ్ జలసంధిని తెరిచేందుకు తాము సిద్ధమని పేర్కొన్నది. అణు కార్యక్రమంపై మాత్రం తర్వాత చర్చిద్దామని ప్రతిపాదించింది. అమెరికాకు ఈ ప్రతిపాదన అందిన నేపథ్యంలో ట్రంప్ తన జాతీయ భద్రత, విదేశాంగ విధాన బృందంతో సిచుచేషన్ రూమ్ సమావేశం నిర్వహించనున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పాకిస్థాన్‌లో పర్యటించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రతిపాదనకు ట్రంప్ అంగీకరించే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచి యుద్ధాన్ని ముగించడం ఇప్పుడు ఇరాన్ కొత్త ప్రతిపాదనని అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఆక్సియోస్ ఒక వార్తాకథనంలో పేర్కొంది.
అణు చర్చలను తర్వాత దశకు వాయిదా వేయాలని పాకిస్థాన్ మధ్యవర్తుల ద్వారా ఇరాన్ అమెరికాకు తన ప్రతిపాదన తెలియచేసినట్లు వార్తాసంస్థ తెలిపింది. చర్చలలో నెలకొన్న ప్రతిష్టంభన, తర్వాత చేపట్టే చర్యల గురించి ట్రంప్ బృందం చర్చిస్తుందని కూడా ఆ కథనం పేర్కొంది. యురేనియం శుద్ధి ప్రక్రియను నిలిపివేయడానికి ఇరాన్‌ను ఒప్పించడం, శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించడం ఇప్పుడు ట్రంప్ యుద్ధ లక్ష్యాలని వార్తాసంస్థ పేర్కొంది. అయితే దీనిపై ఇప్పటివరకు అమెరికా నుంచి అధికారిక ధృవీకరణ లేదు.
హొర్ముజ్‌పై ప్రతిష్ఠంభన
కాల్పుల విరమణ కొనసాగుతున్న తరుణంలో శాశ్వత శాంతికి తదుపరి చర్చలపై ప్రతిష్ఠంభన నెలకొన్నది. కీలకమైన హొర్ముజ్ జలసంధిని అటు అమెరికా, ఇటు ఇరాన్ దిగ్బంధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు, ఆ దేశ ఆయిల్ ఎగుమతులను అడ్డుకునేందుకు హొర్ముజ్‌ను అమెరికా దిగ్బంధించింది. ఎగుమతులు నిలిచిపోవడంతో అయిల్ను నిల్వ చేసేందుకు చోటు లేక ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. హొర్ముజ్ దిగ్బంధంతో అమెరికాపైనా ఒత్తిడి పెరుగుతున్నది. చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రపంచదేశాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇంధనం, ఎరువులు, ఆహార ధరలు భారీగా పెరిగాయి.
‘నాలుగు రెట్లు’ విధ్వంసం సృష్టిస్తాం..
అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ చమురు పైప్లైన్లను పేల్చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ దీటుగా స్పందించింది. ఇరాన్ చమురు కేంద్రాలు, మౌలిక వసతులపై అమెరికా దాడులకు మద్దతు పలికితే గల్ఫ్ దేశాలపై భీకర దాడులకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. తమపై దాడికి ప్రతీకారంగా నాలుగు రెట్లు గల్ఫ్ దేశాల్లో విధ్వంసం సృష్టిస్తామని, మా లెక్కలు మాకున్నాయని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిలీ సాఘబ్ ఇస్ఫహాన్ హెచ్చరించారు. ‘అమెరికా దిగ్బంధనంతో ఇరాన్ చమురు కేంద్రాలు, బావులు సహా మౌలిక వసతులు ఏవి దెబ్బతిన్నా.. మా నుంచి కూడా అదే రీతిలో ప్రతి దాడులు ఉంటాయి. నాలుగు రెట్లు విధ్వంసం సృష్టిస్తాం’ అని ఎక్స్‌లో సందేశాన్ని పోస్ట్ చేశారు. మా లెక్కలు మాకున్నాయని, ఇరాన్లో ఒక్కో చమురు బావి.. నాలుగింటితో సమానమని అన్నారు. అమెరికాతో ఒప్పందానికి రాకపోతే ఇరాన్ చమురు నిల్వ సామర్థ్యాన్ని, సరఫరాను దెబ్బతీస్తామంటూ ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ పై విధంగా స్పందించింది.