హైదరాబాద్ : ఒక వైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే మరో వైపు అమెరికా, ఇరాన్(Iran) యుద్ధంలో పోటీపడి పాల్గొంటున్నాయి. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ కార్గో నౌక టౌస్కాను(Tausca) అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇది అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, త్వరలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. అనుకున్నట్లుగానే అమెరికా దుశ్చర్యకు ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడుతున్నది. అమెరికా యుద్ధనౌకలపై డ్రోన్లతో విరుచుకుపడింది. వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధికి అనుసంధానమైన జలాల్లో ఈ ఘటన ఉద్రిక్తతలను గణనీయంగా పెంచిందని ఇరాన్ వర్గాలను ఉటంకిస్తూ ప్రాంతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
ఈ పరిణామాలు పాకిస్థాన్‌లో జరిగే రెండో విడుత చర్చలపై ప్రభావం చేపే అవకాశం ఉంది. కాగా, పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో మంగళవారం ఇరాన్‌తో రెండు విడత చర్చలు జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) తెలిపారు. కానీ ఆ చర్చలకు తమ ప్రతినిధులను పంపడంలేదని ఇరాన్ చెప్పింది. మంగళవారం జరిగే చర్చలు డీల్ కుదిరే అవకాశం ఉన్నట్లు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కీలకమైన సీజ్ఫైర్ అంశంపై మంగళవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా ట్రంప్ వెల్లడించారు.