Karaj Bridge : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఇరాన్‌లోని కరాజ్ ప్రాంతంలో ఉన్న బీ1 అనే ఒక పెద్ద బ్రిడ్జిపై గురువారం అమెరికా వైమానిక దాడి చేసింది. ఇది పశ్చిమాసియాలోనే అతిపెద్ద బ్రిడ్జి. ఈ దాడుల్లో బ్రిడ్జి చాలావరకు దెబ్బతింది. దీనిపై ఇరాన్ స్పందించింది. తమ దేశంలోని ప్రధాన బ్రిడ్జిపై అమెరికా చేసిన దాడికి ప్రతిగా.. తాము కూడా గల్ఫ్ దేశాల్లోని ప్రధాన బ్రిడ్జిలపై దాడులకు దిగుతామని ప్రకటించింది. అంతేకాదు.. గల్ఫ్ దేశాల్లో దాడిచేయబోయే ఎనిమిది బ్రిడ్జిల వివరాలు వెల్లడించింది.
కువైట్‌లోని షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సబా బ్రిడ్జి, యూఏఈలోని షేక్ జాయెదే బ్రిడ్జి, అల్ మక్తా బ్రిడ్జి, షేక్ ఖలిఫా బ్రిడ్జి, సౌదీ అరేబియా-బహ్రెయిన్‌లోని కింగ్ ఫాహద్ కాజ్వే, జోర్డాన్‌లోని డామియా బ్రిడ్జి, అబ్డోన్ బ్రిడ్జిలను పేల్చేస్తామని ప్రకటించింది. ఈ ప్రాంతంలో ఈ బ్రిడ్జిలు రవాణాకు చాలా కీలకం. అందుకే ఇరాన్ వీటిని లక్ష్యంగా ఎంచుకుంది. ఐఆర్జీసీ ఆధ్వర్యంలో దాడులు చేస్తామని హెచ్చరించింది. అమెరికా పాక్షికంగా కూల్చేసిన బీ1 బ్రిడ్జి ఇరాన్‌కు చాలా కీలకం. ఇది 136 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇంకా కొంత ప్రాంతం నిర్మాణంలో ఉంది. ఇది టెహ్రాన్, కరాజ్ పట్టణాలను కలుపుతుంది. ఈ బ్రిడ్జిపై రెండుసార్లు జరిగిన వైమానిక దాడిలో ఎనిమిది మంది మరణించారు. 95 మంది గాయపడ్డారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడుల సందర్భంగా అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇంకా నష్టం జరగకముందే, ఆలస్యం చేయకుండా తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా ప్రకటించింది.
ఇంకా ఇరాన్‌కు గొప్పగా చెప్పుకోవడానికేమీ మిగలలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ దాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. అమెరికా జరిపిన దాడిని ఖండించారు. పౌర నిర్మాణాల్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సరికాదన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇలాంటి భవనాలపై దాడులు చేసినంత మాత్రాన ఇరాన్ లొంగిపోదని చెప్పారు. దాడిలో ధ్వంసమైన ప్రతి భవనాన్ని, వంతెనను తిరిగి మరింత పటిష్టంగా నిర్మిస్తామని పేర్కొన్నారు.