న్యూఢిల్లీ: హొర్ముజ్ జలసంధిపై డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియడానికి కేవలం మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా అమెరికాతో సుదీర్ఘమైన, భయంకరమైన ఘర్షణకు ఇరాన్ సన్నద్ధమవుతున్నది. ఇటీవలి అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు అధికారులను కోల్పోయినప్పటికీ ఇరాన్ మాత్రం వెనక్కు తగ్గేందుకు నిరాకరించింది. దీంతో ఈ యుద్ధం భూతల దండయాత్రగా మారవచ్చనే భయాలు పెరుగుతున్నాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ అపూర్వ స్థాయిలో సైన్యాన్ని సమీకరిస్తున్నది. లక్షలాది మంది పోరాడేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. పిల్లలను సైతం సైన్యంలోకి అనుమతిస్తున్నారు.
చివరి రక్షణ మార్గంగా మానవ హారాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ భూతల దాడులకు దిగితే దేశం కోసం పోరాడేందుకు 1.40 కోట్ల మంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక టీవీ మంగళవారం తెలిపింది. ప్రజలు స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొనాలని ప్రభుత్వ మీడియా, వాట్సాప్ సందేశాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. యుద్ధంలో పాల్గొనడంపై తమ ఆసక్తిని తెలియచేయాలని రిటైర్డ్ సైనికులకు సైతం ప్రభుత్వం పిలుపునిచ్చింది.
పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన ఆల్ వలంటీర్ బసీజ్ ఫోర్స్ సుమారు 12 ఏండ్ల పిల్లలను సైతం తమ దళంలో చేర్చుకుంటున్నాయి. వారి నియామకాన్ని యుద్ధ నేరమని ప్రకటించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పిల్లలు ఆయుధాలు కూడా పట్టుకుంటారని హెచ్చరించింది. ఇరాన్ కోసం అనే నినాదంతో పిల్లలను చేర్చుకుంటున్నామని, వారు గస్తీలు, చెక్పాయింట్లు, సరుకుల రవాణా వంటి కార్యకలాపాల్లో సహాయపడతారని గార్డ్స్ ఇన్ టెహ్రాన్‌కు చెందిన సాంస్కృతిక అధికారి రహీం నదాలీ తెలిపారు.
సైనిక కార్యకలాపాల్లో పిల్లలను వాడడాన్ని నిషేధిస్తూ బాలల హక్కుల ఒప్పందానికి ఇరాన్ కూడా కట్టుబడి ఉన్నప్పటికీ ఈ పరిణామం తలెత్తడం ఆందోళనకరం. స్వచ్ఛంద కార్యకర్తల కనిష్ఠ వయసును 12 సంవత్సరాలుగా నిర్ణయించామని ఆయన చెప్పారు. సైనిక సిబ్బంది సెక్యూరిటీ చెక్పాయింట్ల వద్దకు తమ పిల్లలను పంపాలని ఇరాన్ సీనియర్ మిలిటరీ కమాండర్ జనరల్ హుస్సేన్ ఎక్తా ప్రభుత్వ టీవీలో వారి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.
ప్రజా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా జరిపే దాడులను అడ్డుకునేందుకు ఏప్రిల్ 7న దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ కేంద్రాల వద్ద యువత, కళాకారులు, క్రీడాకారులు సహా తమ పౌరులందరూ మానవహారాలు ఏర్పాటు చేయాలని ఇరాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. తాము ఇచ్చిన గడువులోపల సంధికి రాకపోతే విద్యుత్తు కేంద్రాలపై దాడి చేస్తామని ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.