జెనీవా, జూన్ 20: తమ దేశం నిర్వహిస్తున్న అణు కార్యక్రమాలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో యూరోపియన్ దౌత్యవేత్తలతో చర్చలు జరిపేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి శుక్రవారం జెనీవా చేరుకున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ విదేశాంగ మంత్రులు, యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధానం అధిపతితో ఆయన జెనీవాలోని ఓ హోటల్లో సమావేశమయ్యారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత పశ్చిమ దేశాలు, ఇరాన్ విదేశాంగ మంత్రుల మధ్య ముఖాముఖీ చర్చలు జరగడం ఇదే మొదటిసారి. సమావేశానికి ముందు అరగ్చి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగినంత కాలం అమెరికాతో చర్చించడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించారు.