వాషింగ్టన్, జూన్ 12: హొర్ముజ్ జలసంధి నుంచి బయలుదేరుతున్న భారత నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడికి ప్రయత్నించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెడుతూ ‘హొర్ముజ్ జలసంధి నుంచి బయలుదేరుతున్న భారతీయ నౌకలపై నిన్న రాత్రి వారు జరిపిన డ్రోన్ విఫల దాడి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని అన్నారు.
అయితే ఆయన ఏ నౌకలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసిందీ వెల్లడించ లేదు. కాగా, ఇటీవల భారత నావికులతో వస్తున్న మూడు చమురు ట్యాంకర్లపై అమెరికా దళాలు దాడులు చేసిన క్రమంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అమెరికా దాడుల్లో ముగ్గురు భారత నావికులు మృతిచెందారు. కాగా, ఒమన్ తీరంలో భారత నావికులతో వస్తున్న నౌకలపై అమెరికా దాడులు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా చార్డ్ డి అఫైర్స్ జాసన్ మీక్స్ను పిలిపిందింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శి ఈ అమెరికన్ దౌత్యవేత్తను పిలిపించి నిరసన తెలియజేశారు.